బీజేపీ వైపు.. టీడీపీ నేతల చూపు

28 May, 2019 08:26 IST|Sakshi

పార్టీ ఘోర పరాజయంతో ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట

బీజేపీ ముఖ్యనేతలతో పల్నాడుకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే భేటీ

అక్రమ మైనింగ్‌ కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు!

సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌ తగలబోతోందా! అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు. జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్‌సీపీలో చేరదామనుకున్న వీరికి ద్వారాలు మూసుకుపోవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. పల్నాడుకు చెందిన సీనియర్‌ మాజీ ఎమ్మెల్యే ఒకరు విశాఖపట్నంకు చెందిన బీజేపీ నాయకుడి ద్వారా ఫోన్‌ చేయించుకుని బీజేపీ ముఖ్యనేతను కలిసినట్టు తెలిసింది. అక్రమ మైనింగ్‌ కేసుల నుంచి బయటపడటంతోపాటు, సీబీఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు సదరు నాయకుడు అధికార పార్టీలో చేరాలని చూస్తున్నట్టు గ్రహించిన బీజేపీ ముఖ్యనేత ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు నిరాకరించినట్టు సమాచారం. దీంతో కొత్తదారులు వెతుకుతున్నట్టు తెలిసింది.

తనకో దారి చూపించమని బీజేపీలోని ఓ సీనియర్‌ నాయకుడిని ఆశ్రయించినట్టు భోగట్టా. జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇదే బాటలో ఉన్నట్టు సమాచారం. వీరంతా టీడీపీకి మరో 20 ఏళ్లపాటు రాజకీయ భవిష్యత్‌ లేదనే నిర్థారణకు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతల్లో అత్యధికులు పార్టీని వీడి బీజేపీలోకి క్యూ కట్టేందుకు వెంపర్లాడుతుండటం విశేషం. ఇదే జరిగితే జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు