ఆగస్టులో పంచాయతీ ఎన్నికలు!

11 May, 2019 03:39 IST|Sakshi

మూడు విడతల్లో పోలింగ్‌

13,060 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

జూలై నెలాఖరున షెడ్యూలు విడుదల?

ఆ దిశగా సంబంధిత విభాగాల కసరత్తు

కొత్త ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు

50% రిజర్వేషన్లకు ఆర్డినెన్సే కీలకం

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీ రాజ్‌ శాఖలు కసరత్తులు మొదలు పెట్టాయి.  ఆగష్టు చివరి, సెప్టెంబరు మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించాలని ఈ విభాగాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈనెల 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల వారీగా సర్పంచుల పదవులకు, వార్డు సభ్యుల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ఆ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టు 1వ తేదీ నాటికే పాత సర్పంచుల పదవీకాలం ముగిసి, ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాదిగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు వాయిదా పడిన నేపధ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఇటీవల సమావేశమై ఆగస్టు, సెప్టెంబరు నెలలో ఎన్నికల నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. 

20వ తేదీలోగా ఓటర్ల జాబితా వర్గీకరణ
రాష్ట్రంలోని మొత్తం 12,918 గ్రామ పంచాయతీలతో పాటు కొత్తగా పంచాయతీలుగా మార్చిన 142 తండాలు కలిపి మొత్తం 13,060 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలన్నదానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్‌ అధికారులు చర్చించారు. ఇందుకు ఆగస్టు చివరి పది రోజుల్లో రెండు విడతలు, సెప్టెంబరు మొదటి వారంలో మిగిలిన ఒక విడత ఎన్నికల నిర్వహించడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దీన్ని ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం ముందుంచి అనుమతి తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రభుత్వం అనుమతి తెలిపితే జులై నెలాఖరున ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. కొత్త ప్రభుత్వం అనుమతించని పక్షంలో ఎన్నికలు మరికొంత కాలం వాయిదా పడతాయి. కాగా, ఈ ప్రక్రియలో భాగంగా 13,060 గ్రామ పంచాయతీలను 1,29,240 వార్డులుగా వర్గీకరించి, ఈ నెల 20వ తేదీలోగా గ్రామంలోని మొత్తం ఓటర్లను వార్డుల వారీగా వర్గీకరించి జాబితాలను కూడా పంచాయతీ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.

ఈసారి 50 శాతమే రిజర్వేషన్లు?
2013లో ఉమ్మడి ఏపీలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీలు 18.88 శాతం, ఎస్టీలకు 9.15 శాతం, బీసీలకు 34 శాతం చొప్పున సర్పంచి పదవుల్లో రిజర్వేషన్లు అమలు చేశారు. అప్పుడు సర్పంచి, వార్డు సభ్యుల పదవులు ఎస్టీ, ఎస్సీ, బీసీలకు మొత్తం 62.03 శాతం రిజర్వు చేశారు. విభజన తర్వాత 13 జిల్లాల ఏపీలో ఎస్టీ, ఎస్సీ జనాభా ప్రాతిపదికగా అమలులో ఉన్న నిబంధనల ప్రకారం 59.85 పదవులను రిజర్వు చేయాల్సి ఉంటుంది. అయితే సుప్రీం కోర్టు ఇటీవల రిజర్వేషన్ల మొత్తం 50 శాతానికి మించడానికి వీల్లేదంటూ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన నేపధ్యంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల మొత్తం 50 శాతానికి కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి వెంటనే ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని రాజ్యాంగంలో పేర్కొనడంతో ఈ ఆర్డినెన్స్‌ జారీ వల్ల బీసీలకు రిజర్వేషన్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత ఉండే ప్రభుత్వం ఈ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకొని అర్డినెన్స్‌ జారీ చేయాల్సి ఉంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 50 శాతం రిజర్వేషన్లకు అనుగుణంగానే నిర్వహించారు. 

మరిన్ని వార్తలు