వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు  

19 Jun, 2018 09:05 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి మహేందర్‌రెడ్డి

చివరి వారంలోపు కొలువు దీరనున్న కొత్త పాలకవర్గాలు

ఈనెల 26న రిజర్వేషన్ల ఖరారు

గ్రామాల అభివద్ధిపై సీఎం ప్రత్యేక దష్టి

రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి

తాండూరు : గ్రామ పంచాయతీ ఎన్నికలు జూలై నెలాఖరు లోపు పూర్తవుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. తాండూరులోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా   మాట్లాడుతూ... నియోజకవర్గంలోని 60 గిరిజనతండాలు, అనుబంధ గ్రామాలను కొత్త జీపీలుగా ఏర్పాటు చేశామన్నారు. 200 మంది ఓటర్లున్న తండాలు, 300 నుంచి 500 మంది ఓటర్లున్న అనుబంధ గ్రామాలను పంచాయతీలుగా గుర్తించామని స్పష్టంచేశారు.

వీటన్నింటికీ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తుందని చెప్పారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ కల్పించామని తెలిపారు. గ్రామాల అభివద్ధిపై సీఎం కేసీఆర్‌ దష్టిసారించారన్నారు. వచ్చే నెలలో ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వివరించారు. ఈనెల 26న పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారవుతాయని చెప్పారు. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అవుతుందన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోందని ఆనందం వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది అన్నదాతలకు రైతుబీమా పథకం కింద రూ.12 వేల కోట్లు అందజేశామని చెప్పారు. జిల్లాలో మరో రెండు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నవాబ్‌పేట, యాలాల మండలాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాండూరు మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా మార్చేందుకు మంత్రి కేటీఆర్‌ రూ.50 కోట్లు ఇవ్వనున్నట్లు స్పష్టంచేశారు.

ఇందులో రూ.25 కోట్లతో అభివద్ధి పనులకు టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యిందని త్వరలో తాండూరు మున్సిపాలిటీలో అభివద్ధి పనులు జరుగుతాయన్నారు. తాండూరు ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు రానున్నాయని, త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామాల్లో చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, టీఆర్‌ఎస్‌ పెద్దేముల్‌ మండల అధ్యక్షుడు కోహీర్‌ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు