‘మూడు రాజధానులతోనే బంగారు భవిష్యత్‌’

4 Jul, 2020 23:15 IST|Sakshi

చంద్రబాబు అండ్‌ కో అమరావతిని దోచుకున్నారు

బలవంతంగా రాజధాని భూములు లాక్కున్నారు

ఎల్లో మీడియా.. కృత్రిమ ఉద్యమం

సీఎం జగన్‌ 3 రాజధానుల నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం

నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్

సాక్షి, అమరావతి : తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గాలికొదిలి అమరావతి పేరుతో రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రైతులను నిలువునా ముంచారని నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ ఆరోపించారు. దొంగల ముఠాకు నాయకుడిగా వ్యవహరించి కొడుకుకు, తన సొంత మనుషులకు సర్వం దోచిపెట్టి రాష్ట్ర భవిష్యత్‌ను పణంగా పెట్టారని విమర్శించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని బాధ్యతగా ముందుకు నడిపించాల్సిందిపోయి విధ్వంసానికి పాల్పడ్డారని మండిపడ్డారు.  గ్రాఫిక్స్ తో ఐదేళ్లపాటు కాలం గడిపిన బాబు అమరావతిని ఒక స్మశానవాటికగా మార్చారని దుయ్యబట్టారు. 

బలవంతంగా భూములను లాక్కున్నారు
‘భూములు ఇవ్వకపోతే ఇబ్బందుల్లో పడతారని రైతులను బెదిరించి బలవంతంగా 33వేల ఎకరాలను లాక్కున్నారు. రాజధాని డిజైన్ల పేరుతో 800 కోట్లు దుబారా చేసిన బాబుకు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కనీసం కౌలు కూడా ఇవ్వాలనిపించలేదు. బాబు దిగిపోయే వరకూ రైతులకు కనీసం ఫ్లాట్లు కూడా కేటాయించకుండా తీవ్ర మోసానికి పాల్పడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని రైతులకు కౌలును అందజేసి రైతుపక్షపాతిగా నిలిచారు. రైతుల పై ఎవరి ప్రేమ ఏపాటిదో ఈ ఒక్క ఉదాహరణే తెలియజేస్తుంది. ఇన్ని మోసాలకు పాల్పడ్డారు కాబట్టే సీఆర్‌డీఏ పరిధిలోని అన్ని నియోజకవర్గాలు తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరిలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. (చదవండి: కొత్త నాటకానికి తెర తీసిన చంద్రబాబు టీమ్)

సొంత కొడుకును గెలిపించుకోలేకపోయారు
సీఆర్‌డీఏ విస్తరించి ఉన్న రెండు జిల్లాలు కృష్ణా, గుంటూరు జిల్లాలల్లోని 33 నియోజకవర్గాల్లో 29 చోట్ల టీడీపీని ప్రజలు మీ దుర్మార్గ పాలన మాకొద్దని తిరస్కరించారు. సొంత కొడుకును కూడా గెలిపించుకొలేక బాబు ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్నారు. టీడీపీ అధినేత అన్యాయాలను, అక్రమాలను, దోపిడీదారు మనస్తత్వాన్ని అర్ధంచేసుకున్న అమరావతి ప్రాంత ప్రజలు గత ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. అన్నిప్రాంతాలను సమాంతరంగా, సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న మహోన్నత లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్ పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రగతిలో అన్ని ప్రాంతాల భాగస్వామ్యం ఉండాలి, అందరికీ అభివృద్ధి ఫలాలు అందించాలన్న సత్సంకల్పంతో 3 రాజధానులను ఏర్పాటు చేయబోతున్నారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు)

మూడు రాజధానులతోనే బంగారు భవిష్యత్‌
గత 70 ఏళ్లలో కేంద్రీకృతమైన అభివృద్ధి కారణంగా మనం ఎంతో నష్టపోయాం. ఈ పరిస్థితి మరోసారి రాకూడదన్న ఆలోచనతో ఏపీకి 3 రాజధానులు ఉండాలని సీఎం వైఎస్‌ జగన్ ప్రతిపాదించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించడం పట్ల 5 కోట్లమంది రాష్ట్ర ప్రజలు  హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల పాటు అభివృద్ధికి నోచుకోని మా ప్రాంతం రాజధాని రాకతో ప్రగతిపథంలో పయనిస్తుందని.. మౌలిక సదుపాయాల కల్పన, రాజధాని హంగులతో మా పిల్లల భవిష్యత్ బాగుంటుందని అన్ని ప్రాంతాల వారు కొత్త ఆశలతో ఉన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం పై రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో సమర్ధిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రంలో ఈ తరహాలో బహుళ రాజధానుల ఏర్పాటుకు ప్రకటనలు చేసి ఆదిశగా అడుగులు వేస్తున్నాయి. 

ఎల్లో మీడియా.. కృత్రిమ ఉద్యమం
తమ తమ రాష్ట్రాలను సమంగా అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాయి. వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే తమ రియల్‌ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుంది.. తమ పార్టీకి ఇక పుట్టగతులు ఉండవన్న భయంతో చంద్రబాబు ప్రస్తుతం కృత్రిమ ఉద్యమానికి తెరలేపారు. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని లేని ఉద్యమాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 200 రోజుల నుంచి అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది తప్ప వాస్తవాలు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతాయి. (చదవండి: సీఎం జగన్‌పై ఎమ్మెల్యేల ప్రశంసలు)

అమరావతిని దోచుకుతిన్నారు
బాబు ఎల్లో మీడియా డ్రామాలను, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా రోడ్లపైకి రాని చంద్రబాబు కుటుంబం.. ఇప్పుడు బయటికి రావడంలో అర్ధం ఏంటి? తమ సొంత ఆస్తి అన్నట్టుగా అమరావతిని దోచుకుతిన్నారు కాబట్టే రాజధాని ఉద్యమం పేరుతో బయటికి వచ్చారని ప్రజలకు అనుకుంటున్నారు. బాబు, ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు పన్నినా వికేంద్రీకరణను అడ్డుకోలేరు. 3 రాజధానులతో రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ఆపలేరు. శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు.. మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెంది దేశానికే ఒక రోల్ మోడల్ గా నిలిచితీరుతుంది’ అంటూ పండుగాయల రత్నాకర్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు