టీడీపీకి షాక్‌

19 Feb, 2019 10:50 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీలో చేరిన అమలాపురం ఎంపీ పండుల

ఆయన బాటలో మరికొందరు త్వరలో చేరే అవకాశం

సాక్షి ప్రతినిధి,తూర్పుగోదావరి,  కాకినాడ: ఆట మొదలు కాకుండానే వికెట్లు పడిపోతున్నాయి. ప్రజాగ్రహాన్ని చవి చూస్తున్న టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రోజుల వ్యవధిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వైఎస్సార్‌సీపీలో చేరుతుండటంతో అయోమయ పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంటున్న సమయంలో అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు చేరిక ముచ్చెమటలనెక్కిస్తోంది. ఎస్సీ సామాజికవర్గ నేతగా, విద్యావేత్తగా పేరున్న రవీంద్రబాబు చేరడంతో వైఎస్సార్‌సీపీ బలం మరింత పెరిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన పార్టీ మారకుండా టీడీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చంద్రబాబును ఇక భరించలేమని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏకైక మగధీరుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డేనని, చంద్రబాబుతో రాష్ట్రం బాగుపడదని బహిరంగ ప్రకటన చేసిన పండుల వైఎస్సార్‌సీపీలోచేరారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో టీడీపీ నుంచి మరిన్ని వలసలు ఉంటాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

కేంద్ర అధికారిగా...
విశాఖపట్నం సెంట్రల్‌ ఎక్సైజ్‌ కస్టమ్స్‌ అండ్‌ సర్వీసు ట్యాక్స్‌ ఆడిషనల్‌ కమిషనర్‌గా పనిచేసిన పండుల రవీంద్రబాబు  గత ఎన్నికల్లో అమలాపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. పదవిలో ఉన్నంత సేపు నిబద్ధతతో పనిచేశారు. కోనసీమ రైల్వే రావడం వెనక ఎంపీ పండుల కృషి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అవినీతి అక్రమాలకు దూరంగా ఉండే రవీంద్రబాబుకు టీడీపీలో సరైన గుర్తింపు లభించలేదు. విజ్ఞానం, వాగ్ధాటి ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో లోక్‌సభలో మాట్లాడేందుకు సరైన అవకాశం ఇవ్వలేదు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీల మాదిరిగా రాజీనామాలు చేద్దామని అధిష్టానానికి చెప్పినా ఆయన మాట వినలేదు. దీంతో విసిగి వేసారి పోయి ప్రత్యేక హోదా కోసం అహర్నిశలు పోరాడుతున్నారని, రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమవుతుందని వైఎస్సార్‌సీపీకి ఆకర్షితుడై పార్టీలో చేరారు.

పండుల బాటలో మరికొందరు...
ఎంపీ పండుల రవీంద్రబాబు బాటలోనే మరికొందరు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరే అవకాశం ఉంది. ఆమేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవినీతిలో కూరుకుపోయి ప్రజావ్యతిరేకతను మూటగట్టుకోవడమే కాకుండా పూటకొక మాట చెప్పి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్న చంద్రబాబుతో రాష్ట్రానికి మేలు జరగదని జిల్లాలో మరికొందరు వైఎస్సార్‌సీపీలోకి రానున్నారు. ఇప్పటికే జిల్లాలో ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ వందలాదిగా టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ బాట పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో వలసలు ఊపందుకున్నాయి. ఇకముందు మరింత ముమ్మరం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు