పన్నీర్‌... కన్నీర్‌

1 Jun, 2019 08:21 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: కుమారుడికి కేంద్ర మంత్రి పదవి ఖాయం...ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అని ఆనందపడిపోయిన ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు చివరికి కన్నీరే మిగిలింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా పన్నీర్‌ ఢిల్లీలోనే తిష్టవేసి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకేకు నరేంద్రమోదీ అండగా నిలిచారు. అప్పటి తాత్కాలిక ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు చేదోడువాదోడుగా నిలిచారు. శశికళ రాజకీయంతో పన్నీర్‌సెల్వం పదవీచ్యుతుడుకాగానే ఆయనకు అనుకూలంగా మోదీ పావులు కదిపారు. శశికళ జైలు కెళ్లగా ఎడపాడి సీఎం అయ్యారు. ఎలాగైన పన్నీర్‌ను సీఎం చేయాలని మోదీ తలంచినా కుదరలేదు. ఎడపాడి, పన్నీర్‌సెల్వం మధ్య నెలకొన్న విబేధాలను రూపుమాపి ఏకం చేయడంలో మోదీ తెరవెనుక పాత్ర ఉంది. ఈ రకంగా మోదీకి ఎడపాడి కంటే పన్నీర్‌సెల్వమే సన్నిహితుడు. ఈ ధైర్యంతోనే తన కొడుకు రవీంద్రనా«థ్‌కుమార్‌ చేత రాజకీయ అరంగేట్రం చేయించి లోక్‌సభ స్థానం పోటీకి నిలబెట్టి గెలిపించుకున్నాడు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కస్థానం కూడా గెలవకపోవడంతో మిత్రపక్ష అన్నాడీఎంకే ఏకైక విజేత రవీంద్రనాథ్‌కుమార్‌కు కేంద్రంలో మంత్రిపదవి ఖాయమని పన్నీర్‌ విశ్వసించారు.

అయితే అన్నాడీఎంకే సీనియర్‌ నేతలను కాదని కొత్తగా వచ్చిన రవీంద్రనాథ్‌కుమార్‌కు అవకాశం ఇవ్వడం ఏమిటనే వాదనను లేవనెత్తారు. ఇందుకు అనుగుణంగా రాజ్యసభ సభ్యుడు వైద్యలింగం పేరును ఎడపాడి తెరపైకి తెచ్చారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇరువురూ పోటీపడడం, తమిళనాడుకు రెండు మంత్రి పదవులు కుదరదు కాబట్టి రవీంద్రనాథ్‌కుమార్‌కు అవకాశం చేజారిపోయింది. పదవీ ప్రమాణం ముగియగానే సీఎం ఎడపాడి, మంత్రులు ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో రాత్రి బసచేసి శుక్రవారం ఉదయం చెన్నైకి చేరుకున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయారు. తేనీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పన్నీర్‌సెల్వం కుమారుడు రవీంద్రనా«థ్‌కుమార్‌ గెలుపొందగానే కేంద్రంలో మంత్రిపదవి ఖాయమనే ప్రచారం జరిగింది. మోదీ ప్రమాణ స్వీకారానికి మూడురోజులు ముందుగానే ఢిల్లీకి చేరుకున్న పన్నీర్‌ తన కుమారుడి కోసం మోదీ, అమిత్‌షాలను కలిశారు. దాదాపు ఖాయం చేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యమంత్రి ఎడపాడి అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు వైద్యలింగంను మంత్రిపదవికి సిఫార్సు చేయడంతో బీజేపీలో ఆలోచనలో పడింది. మంత్రివర్గ విస్తరణ సమయంలో చూసుకుందాములే అన్నట్లుగా చివరి నిమిషంలో వాయిదావేసింది. దీంతో డీలా పడిపోయిన పన్నీర్‌ ఢిల్లీలోనే తిష్టవేశారు. కుమారుడికి మంత్రి పదవి కోసం మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పదవి దక్కకున్నా గట్టి హామీనైనా పొందాలని పన్నీర్‌ పట్టుబట్టి ఉన్నట్లు సమాచారం.

అధిష్టానమే చూసుకుంటుంది: బీజేపీ
ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రంలో నుంచి ఎవరికి స్థానం కల్పించాలనే అంశాన్ని బీజేపీ అధిష్టానమే చూసుకుంటుందని రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. మంత్రివర్గంలో తమిళనాడుకు చోటు కల్పించడంపై పార్టీ పరిశీలిస్తుందని బీజేపీ సీనియర్‌ నేత ఇలగణేశన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు