ప్రత్యేక హోదాపై నోటీసులిచ్చిన ‘పప్పు’

21 Mar, 2018 12:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో బిహార్‌ ఎంపీ పప్పు యాదవ్‌ ఈ అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చారు. బిహార్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. బిహార్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు లోక్‌సభలో అత్యవసర చర్చ జరపాలని కోరుతూ జన్‌ అధికార్‌ పార్టీ(జేఏపీ) అధ్యక్షుడైన పప్పు యాదవ్‌ బుధవారం లోక్‌సభ సెకట్రరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు. తమ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర తగిన నిధులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్రాలను ఎన్డీఏ సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

కేం‍ద్రంపై వైఎస్సార్‌సీపీ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా గత నాలుగు రోజులు పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. వాయిదా పడుతున్న సభ సక్రమంగా జరిగితే ఈ అంశం కూడా చర్చకు రావచ్చు. దేశంలోనే వెనుక బడ్డ రాష్ట్రం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని జేఏపీ చాలా కాలంగా పోరాటం చేస్తోంది. బిహార్‌ ప్రత్యేక హోదా అంశం కూడా తెరపైకి రావడంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

అయితే బిహార్‌కి ప్రత్యేక హోదా విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కూడా స్పందించారు. సోమవారం ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. బిహార్‌ రాష్ట్రనికి ప్రత్యేక హోదా విషయాన్ని ఒ‍క్క నిమిషం కూడా మర్చిపోలేదని, ప్రత్యేక హోదా అనే అంశాన్ని 13 ఏళ్ల క్రితమే తాను ప్రస్తావించానని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో చర్చలు జరుపుతానని తెలిపారు.


 

మరిన్ని వార్తలు