యోగి.. నోరు అదుపులో పెట్టుకో!

9 Jan, 2018 20:57 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం సిద్దరామయ్యపై అనాలోచితంగా ఆరోపణలు, విమర్శలు చేసిన ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నోరు అదుపులో పెట్టుకోవడం ఉత్తమమంటూ కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం పరమేశ్వర్‌ మీడియాతో మాట్లాడారు. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్‌ బీజేపీ సిద్ధాంతాలు, పరివర్తన ర్యాలీ, తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి ప్రస్తావించకుండా కేవలం సీఎం సిద్దరామయ్య లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు.

కర్ణాటకలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, అవినీతి పెరిగిపోయిందని అందుకు సిద్దరామయ్య అసమర్థ పాలనే కారణమంటూ యూపీ సీఎం యోగి చేసిన ఆరోపణలు గురివింద నలుపు సామెతను గుర్తు చేస్తున్నాయన్నారు. దేశంలో అవినీతిలో, నేరాల్లో మొదటిస్థానంలో నిలిచే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం ఉత్తరప్రదేశ్‌ మాత్రమేనన్న విషయాన్ని యోగి ఆదిత్యనాథ్‌ విస్మరించారని పేర్కొన్నారు. ముందు యూపీలో అవినీతి, నేరాలను అదుపు చేసిన తర్వాత యోగి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులపై విమర్శలు చేయాలంటూ హితవు పలికారు. కర్ణాటకలో రైతుల ఆత్మహత్యల గురించి బాధపడ్డ యోగికి నిజంగానే రైతులపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వెంటనే జాతీయ బ్యాంకుల్లో రాష్ట్ర రైతుల రుణాలను మాఫీ చేయించాలంటూ డిమాండ్‌ చేశారు.

సీఎం సిద్దరామయ్య మతం, ఆహారపు అలవాట్లపై హిందూ యువతను రెచ్చగొడుతూ మతవిద్వేషాల వైపు వెళ్లే విధంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. సిద్దరామయ్యతో పాటు తాము కూడా హిందువులేమనని అయితే తాము అన్ని మతాలు, వర్గాల ప్రజలను సమానదృష్టితోనే చూస్తామని బీజేపీ నేతల్లా తాము ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టలేదన్నారు. గుజరాత్‌ ఎన్నికల సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అక్కడి హిందూ దేవాలయాల్లో పూజలు నిర్వహించిన సందర్భాలను బీజేపీ నేతలు గుర్తు చేసుకోవాలన్నారు. చివరికి పర్తివర్తన ర్యాలీలో తాము చేయబోయే అభివృద్ధి గురించి కాకుండా కేవలం మత ఘర్షణల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారంటూ విమర్శించారు. చావులపై కూడా బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటీవల మంగళూరులో హత్యకు గురైన దీపక్‌రావ్‌ హత్య వెనుక బీజేపీ కార్పొరేటర్‌ హస్తం ఉందని ఆరోపించారు. త్వరలోనే ఈ విషయం పోలీసుల విచారణతో రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందన్నారు.

మరిన్ని వార్తలు