పరిషత్‌ ఫలితాలు వాయిదా వేయాలి

23 May, 2019 02:28 IST|Sakshi

రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెల చివరివరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల వెల్లడిని వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డికి బుధవారం బీజేపీ బృందం విజ్ఞప్తి చేసింది. ఫలితాలు వెలువడ్డాక జెడ్పీపీ చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికకు నెలకుపైగా వ్యవధి ఉంటున్నందున పెద్దఎత్తున క్యాంప్‌ రాజకీయాలు, ప్రలోభాల పర్వానికి తెరతీసినట్టు అవుతుందని కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చింది. బుధవారం ఎస్‌ఈసీ కార్యాలయంలో నాగిరెడ్డికి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో చిన్న జిల్లా పరిషత్‌లు ఏర్పడిన నేపథ్యంలో క్యాంప్‌ రాజకీయాలు పెరిగే అవకాశమున్నందున పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని వారు కమిషనర్‌ను కోరారు. తమ విజ్ఞప్తిపై కమిషనర్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు.  

ప్రలోభాలకు అవకాశం: కె.లక్ష్మణ్‌
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీసీ రిజర్వేషన్లను తుంగలో తొక్కి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని లక్ష్మణ్‌ విమర్శిం చారు. కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27న పరిషత్‌ ఫలి తాలు వెలువడ్డాక, జూలై 12న జెడ్పీపీ చైర్‌పర్సన్‌ ఎన్నికలు ఉంటాయని అధికారులు చెబుతున్నారని, ఇంత వ్యవధి ఇస్తే పెద్దఎత్తున ప్రలోభాలకు అవకాశంతో పాటు గెలిచిన అభ్యర్థులను అధికార పార్టీకి అనుకూలంగా తిప్పుకునే అవకాశాలు పెరుగుతాయన్నారు. అందువల్ల స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపును జూన్‌ ఆఖరు వరకు వాయిదా వేయాలని కమిషనర్‌ ను కోరామన్నారు. కమిషనర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు