అక్కడా వారిదే పెత్తనం!

24 Apr, 2019 04:05 IST|Sakshi

14 అసెంబ్లీ స్థానాల్లోని టీఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన 

టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకే బీఫారాల పంపిణీ బాధ్యత 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన టీఆర్‌ఎస్‌ నేతలకు ఇబ్బందికర పరిస్థితి

సాక్షి, హైదరాబాద్‌: పరిషత్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహం ఆ పార్టీలోనే చర్చనీయాంశమైంది. పరిషత్‌ ఎన్నికల బీఫారాల పంపణీ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములునాయక్, రామగుండంలో ఏఐఎఫ్‌బీ తరఫున గెలిచిన కోరుకుంటి చందర్‌ ఫలితాలు వెల్లడైన వారంలోనే టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం టీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో బీఫారాల పంపిణీలో ఇబ్బందులు లేవు.

ఇతర పార్టీల తరఫున గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన 14 మంది ఎమ్మెల్యేల సెగ్మెంట్లలోనూ పరిషత్‌ ఎన్నికల టీఆర్‌ఎస్‌ బీఫారాల పంపిణీ బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకే అప్పగించారు. అయితే, ఈ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినవారిలో ఆందోళన నెలకొంది. అభ్యర్థుల ఎంపికలో తమకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంపట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తొలివిడత నామినేషన్‌ దాఖలు ప్రక్రియ బుధవారం ముగిసిపోతుంది. కాగా, కాంగ్రెస్‌కు చెందిన ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యేల అభీష్టం... 
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినవారికి ఈ బాధ్యతలు ఉంటాయని భావించారు. అయితే ఆయా నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అధికసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరడంతో పరిస్థితి మారిపోయింది. బీఫారాల పంపిణీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు వ్యవహారాలను వీరే చూసుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు బీఫారాలను ఎమ్మెల్యేలకే ఇచ్చారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి ఓడిపోయినవారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు తమతో ఉన్నవారికి పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావడంలేదని అంటున్నారు. పరిషత్‌ అభ్యర్థుల ఎంపికలో టీఆర్‌ఎస్‌లోని ద్వితీయ శ్రేణి నేతలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా రు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలసి ఈ విషయంపై విన్నవించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు