ఆగని టీడీపీ నేతల అరాచకాలు

16 Mar, 2020 11:26 IST|Sakshi
పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓలపై దాడులకు పాల్పడుతున్న పరిటాల శ్రీరామ్‌ అనుచరులు, టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి రంగయ్య

ఎన్నికల కోడ్‌ అమలుకు అడ్డు

అధికారులపై దాడులకు యత్నం

దుర్భాషలాడిన పరిటాల శ్రీరామ్‌

చర్యలు తీసుకోని పోలీసులు

ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ నేతలు

రామగిరి: రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. అధికారంలో ఉన్నా...లేకపోయినా.. తమ ఆధిపత్యం కొనసాగిస్తూ ప్రజలపైన, అధికారులపైన జులుం ప్రదర్శిస్తున్నారు. మండల కేంద్రం రామగిరిలో ఏర్పాటు చేసిన ద్వారానికి పరిటాల అనే పేరుండడంతో ఎంపీడీఓ గోవిందదాస్, పంచాయతీ కార్యదర్శి నాగమునిలు ఆదివారం అక్కడికెళ్లి జేసీబీతో ద్వారానికి తెల్లని వస్త్రం కప్పారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ తన అనుచరులతోవచ్చి అధికారులపై దాడులకు దిగారు. ఏకంగా అధికారులనే దుర్భాషలాడుతూ.. వారి విధులకు ఆటంకం కలిగిస్తూ భయాందోళన సృష్టించారు. ఈ విషయమై వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీఐ జి.టి.నాయుడు, ఎస్‌ఐ నాగస్వామిలు తమ పోలీస్‌ సిబ్బందితో ఇరువర్గాలనూ చెదరగొట్టారు. ఎన్నికల కోడ్‌ అమలు చేస్తున్న అధికారులపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నాయకులపై పోలీసులు ఎటువంటి చర్యలూ చేపట్టకపోవడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు రోడ్డుపైన, పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో బైటాయించి       ఆందోళన చేశారు.

తలలు పగులుతాయ్‌: పరిటాల శ్రీరామ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు  
కనగానపల్లి: మళ్లీ తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్‌ విగ్రహాలతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల తలకాయలు కూడా పగలగొడతామని టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్‌ రెచ్చగొట్టే వాఖ్యలు చేశాడు. ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా ఆదివారం రామగిరిలో అధికారులు రహదారి ద్వారంపై ఉన్న పరిటాల రవీంద్ర పేర్లు తొలగించటంపై టీడీపీ నాయకులు రాద్దాంతం చేసి ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద పరిటాల శ్రీరామ్‌ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న వైఎస్సార్‌ విగ్రహాన్ని పగలగొట్టి తాడువేసుకొని ఈడ్చుకొని వెళ్లింది మనమేనని, ఇప్పుడు అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతే తిరిగి మనం అధికారంలోకి వచ్చాక వారు పెట్టిన వైఎస్సార్‌ విగ్రహాలను పగలగొట్టటంతో పాటు ఆ పార్టీ కార్యకర్తల తలకాయలు కూడా పగులుతాయని అన్నాడు. దీంతో పాటు గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మనకు భయపడి వైఎస్సార్‌సీపీ నేతలు ఎవ్వరూ రామగిరి మండలంలోకి అడుగు పెట్టలేకపోయారని బూతు మాటలతో టీడీపీ కార్యకర్తలను మరింత రెచ్చగొట్టాడు. పోలీసులు అడ్డులేకపోతే ఇప్పుడే వారి అంతు చూసేవారిమన్నారు. ఒకవైపు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా, ఫ్యాక్షన్‌ ప్రాంతంగా ఉన్న రామగిరి మండలంలో టీడీపీ నాయకులు పబ్లిక్‌లోకి వచ్చి ఇలా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటంపై సర్వత్రా భయాందోళన కల్గిస్తోంది. పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ మండల నాయకులు ఎన్నికల అధికారులను కోరుతున్నారు.

మరిన్ని వార్తలు