ప్రకాష్‌రెడ్డి అంటే భయామా?

5 Feb, 2018 08:18 IST|Sakshi
ఎన్‌ఎస్‌గేట్‌లో పహారా కాస్తున్న స్పెషల్‌పార్టీ పోలీసులు

మంత్రి సునీత సొంత పంచాయతీలోకి వెళ్లనివ్వని పోలీసులు

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నతాధికారులు

రామగిరి: రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త ప్రకాష్‌రెడ్డిని  రామగిరి మండలంలో అడుగు పెట్టకుండా ఆదివారం అడుగడుగునా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేరూరు డ్యాంను నీటితో నింపడంతో పాటు పేరూరు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసే విషయంపై రైతులతో చర్చించేందుకు నసనకోట పంచాయతీలోని ముత్యాలంపల్లిలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశానికి ప్రకాష్‌రెడ్డి  పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే సమావేశం నిర్వహణకు అనుమతి ఇవ్వడంతో పాటు ఆ ప్రాంతంలో ఎలాంటి అలజడులూ తలెత్తకుండా ఉండేందుకు పది మంది పోలీసులతో బందోబస్తు కల్పించాలంటూ పది రోజుల క్రితం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, ధర్మవరం డీఎస్పీ, రామగిరి సీఐకు ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డితో కలిసి ప్రకాష్‌రెడ్డి వినతిపత్రం ఇచ్చారు.

గ్రామీణుల్లో ఆందోళన
సమావేశం నిర్వహణపై సమాచారం అందుకున్న మంత్రి పరిటాల సునీత అప్రమత్తమయ్యారు. ప్రకాష్‌రెడ్డిని ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకెళ్లారు. ఫలితంగా సమావేశం నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.  కేవలం పది మంది పోలీసుల భద్రతతో సమావేశం ముగిసే అవకాశమున్నా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నతాధికారులు.. రామగిరి మండల వ్యాప్తంగా వంద మందికి పైగా పైగా స్పెషల్‌ పార్టీ పోలీసులను రంగంలో దింపారు. పేరూరు, వెంకటాపురం, ఎంసీ పల్లి, కుంటిమద్ది, గరిమేకలపల్లి, చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎన్‌ఎస్‌గేట్, కనగానపల్లి మండలంలోని మద్దెలచెరువు గ్రామాల చుట్టూ పోలీసులను మోహరింపజేశారు. దీంతో ఏం జరుగుతోందో తెలియక ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది.

అడుగడుగునా అరెస్ట్‌లు
ముత్యాలంపల్లిలో నిర్వహించనున్న సమావేశానికి దాదాపు 200 మంది కార్యకర్తలతో బయలుదేరిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ మీనుగ నాగరాజుకు అడుగుడునా నిర్భందాలే ఎదురయ్యాయి. ఎటుచూసినా పోలీసులు అతన్ని నిలువరించేందుకు ప్రయత్నించారు. చివరకు నాగరాజు, తదితరులను రామగిరి సీఐ యుగంధర్‌ అదుపులోకి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అలాగే చిగురుచెట్టు వద్ద ఉన్న వంద మంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని చెన్నేకొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మంత్రి పరిటాల సునీత ప్రమేయంతోనే ఉద్రిక్తత నెలకొందని, ప్రకాష్‌రెడ్డి అంటే అంత భయమెందుకు అంటూ గ్రామీణులు చర్చించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు