అగ్రనేత రాకతో పొలిటికల్‌ హీట్‌! 

30 Mar, 2019 02:48 IST|Sakshi

రాష్ట్రంలో ఊపందుకున్న ప్రచారం 

ఒకేరోజు ప్రధాని, సీఎంల సభలు 

1న మోదీ, రాహుల్‌ పర్యటన 

రెండో విడత ప్రచారం మొదలుపెట్టిన కేసీఆర్‌ 

వచ్చే నెల మొదటి వారంలో రెండ్రోజులు అమిత్‌షా మకాం 

అదే సమయంలో కమ్యూనిస్టు సభలు 

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. స్థానిక నేతలతో జరుగుతున్న ప్రచారానికి ఊపునిస్తూ జాతీయ స్థాయి నేతలు వస్తుండటంతో ప్రచార వేడి పెరిగింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మొదటి దశ ప్రచారాన్ని పూర్తిచేసి శుక్రవారం నుంచి రెండో విడత ప్రచారం ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారమే రాష్ట్రంలో తొలి పర్యటన జరిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తూ ఆయన ప్రసంగం సాగటంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆయన మాటలకు కౌంటర్‌గా మిర్యాలగూడ బహిరంగ సభలో మోదీపై కేసీఆర్‌ పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు.

కేంద్ర పథకాలు మొదలు బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ వరకు ఆయన విమర్శలు గుప్పిస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. దీంతో ఒక్కసారిగా ఎన్నికల ప్రచార వేడి రగులుకుంది. మరోవైపు టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కరీంనగర్‌ ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ వచ్చే నెల 1న మరోసారి రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. కేంద్రం పనితీరుపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు చేసే విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టేలా మోదీ ఉపన్యా సం ఉంటుందని కమలనాథులు పేర్కొంటున్నారు. 

కాంగ్రెస్‌కు జోష్‌.. 
కాంగ్రెస్‌ ప్రచారానికి ఊపునిస్తూ ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా వచ్చేనెల 1న రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. వనపర్తి, జహీరాబాద్, హుజూర్‌నగర్‌లలో బహిరంగ సభల్లో మాట్లాడుతారు. ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీల సభలు ఒకేరోజు ఉండటంతో జాతీయ మీడియా దృష్టి కూడా ఆ రోజున తెలంగాణ మీదే ఉండబోతోంది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ రహిత కూటమి అధికారంలోకి రావాలంటూ సీఎం కేసీఆర్‌ తరచూ పేర్కొంటూ ఇప్పటికే జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఇక వచ్చేనెల మొదటి వారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రెండ్రోజుల పాటు తెలంగాణలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. 4న వరంగల్, కరీంనగర్‌లలో 5న హైదరాబాద్, నల్లగొండల్లో ఆయన ప్రసంగించనున్నారు. 

కమ్యూనిస్టులూ రంగంలోకి.. 
కమ్యూనిస్టు పార్టీలు కూడా బహిరంగ సభలకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో సభలు ఏర్పాటు చేస్తున్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, పార్టీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు నారాయణ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకారత్, రాఘవులు తదితరులు ఈ సభల్లో పాల్గొంటారు.   

మరిన్ని వార్తలు