రాహుల్‌ వచ్చినా.. ఒక్కచోటే గెలుపు

24 May, 2019 04:14 IST|Sakshi

నల్లగొండలో గెలుపు.. చేవెళ్ల, జహీరాబాద్, నాగర్‌కర్నూల్‌లో ఓటమి  

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరువు నిలుపుకునే స్థాయిలో సీట్లు సాధించుకున్నా.. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రచారం చేసిన స్థానాల్లో ఒకటి మినహా మిగతాచోట్ల ఓటమి పాలైంది. రాహుల్‌ రెండు విడతలుగా నాలుగు పార్లమెంట్‌ స్థానాలు చేవెళ్ల, నల్లగొండలో ఒక విడతలో, జహీరాబాద్, నాగర్‌కర్నూల్‌లో మరో విడతలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేవెళ్లలో జరిగిన ప్రచార సభల్లోనే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానాల అభ్యర్థులు పాలుపంచుకున్నారు. నల్లగొండ సభకు భువనగిరి అభ్యర్థితోపాటు కార్యకర్తలు హాజరయ్యారు. జహీరాబాద్‌ సభకు మెదక్, నిజామాబాద్, నాగర్‌కర్నూల్‌ సభకు మహబూబ్‌నగర్‌ అభ్యర్థులు హాజరయ్యారు.

అయితే ఇందులో నల్లగొండ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఒక్కరే గెలిచారు. మిగతా చోట్ల జరిపిన సభల్లో అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. ఇందులో చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జహీరాబాద్‌ అభ్యర్థి మదన్‌ మోహన్‌రావులు మాత్రమే 8 వేల కన్నా తక్కువ ఓట్లతో ఓటమి పాలవగా, మిగతా చోట్ల అభ్యర్థులంతా భారీ మెజార్టీలతో ఓటమి చెందారు. రాహుల్‌ తన ప్రసంగాల్లో రాష్ట్రానికి సంబంధించి కాళేశ్వరం ఎత్తిపోతల అంచనాల పెంపు, అవినీతి, కుటుంబ పాలనపై విమర్శలు చేశారు. దీంతోపాటే రఫేల్‌ యుద్ధ విమానాల కుంభకోణంతోపాటు, అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.72 వేల ఆర్థికసాయం అంశాలను ప్రస్తావించారు. అయినా రాహుల్‌ ప్రచారం చేసిన పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు