‘రూ. 10 వేల ట్రీట్‌మెంట్‌కు లక్షల్లో ఖర్చు చేశారు’

24 Aug, 2018 13:53 IST|Sakshi

విజయవాడ: ప్రజా సమస్యలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హంగు-ఆర్భాటాల పేరుతో భారీ స్థాయిలో నిధులను దుర్వినియోగం చేస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. విదేశీ పర్యటనలు, సొంత గృహాలకు ప్రజాధనం ఖర్చు చేయడాన్ని పార్థసారధి ప్రశ్నించారు. శుక్రవారం విజయవాడలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన పార్థసారధి.. కృష్ణా డెల్టా రైతాంగానికి ఖర‍్చు చేయాల్సిన నిధులను మంత్రి దేవినేని ఉమ వాకింగ్‌ ట్రాక్‌కు వినియోగించారని ఆరోపించారు.

మరొకవైపు మంత్రి యనమల రామకృష్ణుడు రూట్‌ కెనాల్‌ ట్రీట్‌మెంట్‌కు సింగపూర్‌లో రూ. 2 లక్షల 80 వేలు ఖర్చు చేయడాన్ని పార్థసారధి ప్రశ్నించారు. రూ. 10 వేల ట్రీట్‌మెంట్‌కు లక్షల్లో ఖర్చు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. యనమల రూట్‌ కెనాల్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకోవడానికి  అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఆస్పత్రి లేదా అని పార్థసారధి ప్రశ్నించారు. అదే సమయంలో యనమల ట్రీట్‌మెంట్‌కు అయ్యే మొత్తం ఖర‍్చును ప్రభుత్వం చెల్లిస్తుందా అని నిలదీశారు. అలాగైతే మంత్రికో నిబంధనా.. సామాన్య ప్రజలకో నిబంధనా ఎందుకో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పదేపదే చంద్రబాబు సర్కార్‌ దుబారా ఖర్చు చేస్తుందని మండిపడ్డారు. రాత్రి బీజేపీతో, పగలు కాంగ్రెస్‌తో కాపురం చేస్తున్న చంద్రబాబు.. తన స్వార్థ ప్రయోజనాలే తప్ప.. ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు.  ప్రతీ విషయంలోనూ అంచనాల పేరుతో నిధులు కాజేయడానికి ప‍్రయత్నానికి జరుగుతున్నాయన్నారు. కృష్ణా డెల్టా ఆధునీకరణలో మంత్రి దేవినేని ఉమ లబ్దిపొందారని పార్థసారధి విమర్శించారు.

>
మరిన్ని వార్తలు