చంద్రబాబు అప్పుల అప్పారావు

22 Aug, 2018 04:44 IST|Sakshi

     వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజం 

     టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి క్యాన్సర్‌ జబ్బులా పట్టుకుంది 

     చంద్రబాబు దోచుకున్న సొమ్ముతోనే అమరావతి బాండ్లు కొన్నారు 

     పాలన చివరి రోజుల్లో అందినకాడికి దండుకోవడానికి బాబు పన్నాగం 

విజయవాడ సిటీ: టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి క్యాన్సర్‌ జబ్బులా పట్టుకుందని, ఆర్థికంగా అతలాకుతలం చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లుగా దోచుకున్న సొమ్మును తిరిగి దొడ్డిదారిన ఇన్వెస్టర్ల రూపంలో అప్పుగా ఇచ్చి, దీర్ఘకాలం వడ్డీరూపంలో పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. ఆయన మంగళవారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు రాష్ట రాజధానిని ఆర్థిక వనరుగా మార్చుకుని విచ్చలవిడిగా దోచుకుంటున్నాడని మండిపడ్డారు. స్వలాభం కోసం రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను తాకట్టు పెట్టాడని విమర్శించారు. అప్పుల అప్పారావుగా మారి రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ముంచేస్తున్నాడని దుయ్యబట్టారు.

విభజన చట్టం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణం జరిగితే ముడుపులు రావని రూ.వేల కోట్లు దోచుకోవడానికి కుట్ర పన్నారని పేర్కొన్నారు. రాజధాని పేరుతో రూ.2,000 కోట్ల విలువైన బాండ్లను ప్రభుత్వం ఏ విధంగా జారీ చేసిందో ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10.32 వడ్డీకి రూ.2,000 కోట్లు సేకరించిందన్నారు. అది కూడా కేవలం తొమ్మిది మంది ఇన్వెస్టర్ల నుంచి గంటలోనే సేకరించిందంటే ఇదంతా చంద్రబాబు దోచుకున్న సొమ్మేనని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిన్న చిన్న మదుపరులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు వేల మంది ఉన్నారని, వారి నుంచి రూ.10.32 శాతం వడ్డీకి అప్పులు తీసుకుంటే వారందరికీ మేలు జరిగేది కాదా? అని నిలదీశారు. బాండ్ల అమ్మకం ద్వారా నిధులు సమకూర్చేందుకు బ్రోకర్లను పెట్టుకొని వారికి రూ.17 కోట్లు అప్పనంగా చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ. 6,000 కోట్లు నొక్కేయడానికి కుట్ర 
‘‘10.32 శాతం కంటే తక్కవ వడ్డీకి ప్రతిపక్షం అప్పులు ఇప్పించగలదా అని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. సీఎం చంద్రబాబు, టీడీపీ మంత్రులకు సిగ్గుంటే.. చేతగాని దద్దమ్మలనే నిర్ణయానికి వస్తే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పదవుల నుంచి దిగిపోతే, 10.32 శాతం కంటే తక్కువకు రుణాలను సేకరించే దమ్ము ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉంది.  చంద్రబాబును ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. అందుకే పాలన చివరి కాలంలో అందినకాడికి దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారు. నాలుగేళ్లు నిద్రపోయి రాజధానికి రూ.5,000 కోట్లు కూడా ఖర్చు చేసి శాశ్వత భవనం నిర్మించలేని ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఆఖరి సంవత్సరంలో దాదాపు రూ.60,000 కోట్ల టెండర్లు పిలుస్తోంది. నిర్దిష్ట ప్రణాళిక లేకుండా టెండర్లు పిలిచి గతంలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టర్లకు 15 శాతం అడ్వాన్స్‌లు చెల్లించి, వారి నుంచి 10 శాతం ముడుపులు నొక్కేస్తున్నారు. రూ.60,000 కోట్లలో రూ.6,000 కోట్లు జేబుల్లో వేసుకోవడానికి చంద్రబాబు కుట్ర పన్నారు’’ అని కొలుసు పార్థసారథి ఆరోపించారు.

మరిన్ని వార్తలు