జనసేనకు మరో షాక్‌.. మరో సీనియర్‌ నేత గుడ్‌బై

3 Nov, 2019 16:27 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: జనసేన పార్టీకి  విశాఖలో బిగ్‌ షాక్‌ తగిలింది. ఇసుక అంశంపై పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం నగరంలో లాంగ్‌ మార్చ్‌ చేపట్టిన సమయంలోనే ఆ పార్టీ సీనియర్‌ నేత పసుపులేటి బాలరాజు గుడ్‌బై చెప్పారు. జనసేనకు రాజీనామా చేసిన ఆయన ఈ సందర్బంగా పార్టీ అధినాయకత్వం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేనలో ప్రజాసమస్యలపై చర్చ  జరగడం లేదని, ఆ పార్టీతో ప్రజాసమస్యలు పరిష్కారం  అయ్యే అవకాశాలు తక్కువ అని ఆయన తేల్చి చెప్పారు. ఇసుక కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. పవన్‌ కల్యాణ్‌  మార్చ్‌లు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. విశాఖ మన్యం ప్రాంతంలో బాక్సైట్  తవ్వకాలను రద్దు చేస్తూ జీవో 97ను జారీచేయడం, పాడేరులో మెడికల్  కాలేజీ మంజూరు చేయడం హర్షనీయమని ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.

ప్రజలకు ఉపయోగపడతానని భావించే పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని పసుపులేటి బాలరాజు తెలిపారు. గత ఎన్నికల్లో ఆయన పాడేరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత కొద్దిరోజులుగా బాలరాజు జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.  పవన్‌ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన లాంగ్‌ మార్చ్‌ సన్నాహాల కోసం శనివారం జరిగిన సమావేశానికి కూడా గైర్హాజరు అయ్యారు.

మరిన్ని వార్తలు