మోదీ నిర్ణయాలను తప్పుపట్టిన ‘పతంజలి’

26 May, 2018 16:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వినియోగ ఉత్పత్తుల రంగంలో ఆయుర్వేద, సహజ ఉత్పత్తులతో శరవేగంగా దూసుకుపోతున్న పతంజలి కంపెనీకి ఊహించని బ్రేక్‌ పడింది. 2009లో వినియోగ ఉత్పత్తుల ఆయుర్వేద కంపెనీని ఏర్పాటు చేసిన నాటి నుంచి అనూహ్య లాభాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న పతంజలి కంపెనీ 2018 సంవత్సరానికి తన లాభాలు రెట్టింపు అవుతాయని ఆశించింది. 2017లో సాధించిన ఉత్పత్తుల టర్నోవర్‌ 10, 500 కోట్ల రూపాయల వద్దనే ఆగిపోయింది. అంటే, 2018 సంవత్సరంలో కంపెనీ టర్నోవర్‌ ఒక్క పైసా కూడా పెరగలేదన్న మాట. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడం, జీఎస్టీ పన్నును ప్రవేశ పెట్టడం వల్ల ఎలాంటి పురోగతి సాధించలేకపోయామని పతంజలి కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకష్ణ మీడియాకు తెలియజేశారు. 2018 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ ఇరవై వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేశారు. వ్యక్తిగత వినియోగం నుంచి గృహావసరాలు, ఆహార పదార్థాల వరకు దాదాపు వెయ్యి ఉత్పత్తులను పతంజలి సంస్థ విక్రయిస్తోంది. త్వరలో దుస్తుల రంగంలో కూడా ప్రవేశించాలనుకుంటోంది. ఈసారి టర్నోవర్‌ పెరగకపోవడానికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని కంపెనీ సాకుగా చూపిస్తోందని, వాటి ప్రభావం చాల తక్కువని టెక్నోపాక్‌ కన్సల్టింగ్‌ సంస్థ ఉపాధ్యక్షుడు అంకూర్‌ బైసన్‌ తెలిపారు. 

పతంజలి అతి తక్కువ ఉత్పత్తులతోని మార్కెట్‌లోకి ప్రవేశించడం, స్వచ్ఛ వనమూలికలతోని చేసినవంటూ వాటికి మంచి ప్రచారం కల్పించడం,  యోగా గురువుగా పతంజలికి మంచి పేరు ఉండడం, అప్పటికే మార్కెట్‌ రంగంలో ఉన్న కంపెనీలు తమ ఉత్పత్తులకు అంతగా ప్రచారాన్ని కల్పించక పోవడం వల్ల పతంజలి ఉత్పత్తులు మార్కెట్‌లో దూసుకుపోయాయని, ఆ తర్వాత పతంజలి తమ ఉత్పత్తులను విపరీతంగా పెంచేయడం, వాటిలో జంతు సంబంధిత అవశేషాలు కూడా వాడుతున్నారని తెలియడం, పతంజలికి పోటీగా ఇతర కంపెనీలు కూడా తమ ఉత్పత్తులకు విస్తత ప్రచారాన్ని కల్పించడం తదితర కారణాల వల్ల పతంజలి ఉత్పత్తుల జోరుకు బ్రేక్‌ పడిందని ఆయన వివరించారు. 

కేశాల సంరక్షణకు హిందూలేఖ బ్రాండ్‌ను 2015లో హిందుస్థాన్‌ లీవర్‌ కంపెనీ తీసుకరావడం, కాల్గేట్‌ కంపెనీ కూడా 2016లో హెర్బల్‌ టూత్‌పేస్ట్‌ను తీసుకరావడం, ఆయుష్‌ బ్రాండ్‌ కూడా గతేడాది హెర్బల్‌ పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తి తీసుకరావడంతో పతంజలి ఉత్పత్తులకు పోటీ పెరిగిందని బైసన్‌ తెలిపారు. 2018 సంవత్సరంలో వాస్తవానికి హెర్బల్‌ ఉత్పత్తుల రెవెన్యూ 13.5 శాతం పెరిగిందని నీల్సన్‌ ఇండియా కంపెనీ ఓ నివేదికలో వెల్లడించింది. 
 

మరిన్ని వార్తలు