'పార్టీ ఎజెండాను నితీశ్‌ అపహాస్యం చేశారు'

29 Jan, 2020 09:18 IST|Sakshi

పట్నా : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, దౌత్యవేత్త పవన్ వర్మ 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నితీష్ కుమార్ 'వార్ రూమ్' ను విజయవంతంగా నడిపించారు. రాష్ట్ర జనతాదళ్ (ఆర్జెడి), జనతాదళ్ (యునైటెడ్)లతో కూడిన గ్రాండ్ అలయన్స్ కూటమి తరపున నితీశ్‌ ముఖ్యమంత్రి అవడంలో కీలకపాత్ర పోషించారు. అయితే తాజాగా వీరిద్దరు నితీశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా మారారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు నితీశ్‌ మద్దతు ఇవ్వడంపై వీరిద్దరు విరుచుకుపడుతున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జేడియూ బిజెపితో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టార్‌(ఎన్‌పీఆర్‌), నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ (ఎన్‌ఆర్సీ)లపై కూడా నితీశ్‌ స్పందించడం లేదు. దీంతో సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్నార్సీలపై నితీశ్‌ నుంచి తాను కేవలం  సైద్దాంతిక స్పష్టతను కోరుతున్నట్లు పవన్‌ వర్మ వెల్లడించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గురించి  నితీశ్‌ కుమార్ చేసిన వ్యాఖ్యలను పవన్‌ వర్మ గుర్తుచేస్తూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ ధరించే కాషాయ దుస్తులు దేశానికి "అత్యంత ప్రమాదకరమైనదని' అభివర్ణించారని వెల్లడించారు. తాజాగా ఢిల్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని పార్టీ ఎజెండాను నితీశ్‌ అపహాస్యం చేశారని మండిపడ్డారు. కాషాయ ఎజెండాకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, సోషలిస్టు శక్తులు తిరిగి సంఘటితం కావాల్సిన అవసరం ఉందని పవన్‌ వర్మ పేర్కొన్నారు.(ప్రశాంత్‌ కిషోర్‌, నితీష్‌ మధ్య బయటపడ్డ విభేదాలు..!)

సీఏఏకు నితీశ్‌ మద్దతివ్వడంపై జేడియూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌ మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నసంగతి తెలిసిందే. కాగా మంగళవారం, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రశాంత్‌ కిషోర్‌పై ' ఉండాలనుకుంటే ఉండు లేకపోతే లేదు' అంటూ విరుచుకుపడిన సంగతి తెలిసిందే.  దీనిపై ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్‌లో స్పందించారు. బీజేపీ నాయకుడు అమిత్‌ షా ఆదేశాల మేరకే తనను పార్టీలోకి తీసుకున్నానని నితీశ్‌ చెప్పినవన్నీ అబద్దాలేనంటూ ప్రశాంత్‌ కొట్టిపారేశారు.(అమిత్‌ షాకు ప్రశాంత్‌ కిషోర్‌ కౌంటర్‌..!)

మరిన్ని వార్తలు