ఉనికి కోసమే పవన్‌ లాంగ్‌ మార్చ్‌: మంత్రి అనిల్‌

2 Nov, 2019 14:14 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అయిదేళ్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కొన్నికోట్ల మేర ఇసుక దందా నడిచిందని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలన అంతా కరవేనని ఆయన అన్నారు. మంత్రి అనిల్‌ కుమార్‌ శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ వరద కారణంగానే రాష్ట్రంలో ఇసుక కొరత ఉంది. ఎక్కడా ఇసుక మాఫియా జరగకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. వరదలు తగ్గగానే పుష్కలం‍గా ఇసుక అందుబాటులోకి వస్తుంది. సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే ప్రకృతి పరవశించింది. మంచి నేత ముఖ్యమంత్రి అయినందువల్లే 86శాతం రిజర్వాయర్లు నిండాయి.

ఇంతకీ పవన్‌ కల్యాణ్‌ చేస్తోంది లాంగ్‌ మార్చా?... రాంగ్‌ మార్చా?. ఉనికి కోసమే ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా ఇసుకను దోచుకుంటుందా? అయిదేళ్లుగా ఎవరు ఇసుక మాఫియా చేశారో అందరికీ తెలుసు. అందుకే ప్రజలు చంద్రబాబుకు 23 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఏ రోజూ చంద్రబాబును పవన్‌ ప్రశ్నించిన దాఖలాలు లేవు. వాళ్లిద్దరూ కుమ్మక్కయ్యారు. చంద్రబాబు, పవన్‌ను సూటిగా అడుగుతున్నా?. విశాఖలో లాంగ్‌ మార్చ్‌ ఎందుకు చేస్తున్నారు?. కృష్ణా, గోదావరి, వంశధార ఒడ్డన చేయాలని కోరుతున్నా. రాష్ట్రంలో రైతులు సహా అందరూ సంతోషంగా ఉన్నారు. వారం, పదిరోజుల్లో ఇసుక కొరత తీరుస్తాం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే పవన్‌ లాంగ్‌ మార్చ్‌ అంటున్నాడు. చంద్రబాబు హయాంలో ఎక్కడైనా ఒక్క ఇసుక లారీని సీజ్‌ చేశారా? ప్రభుత్వ పాలన పారద్శకంగా నడస్తుంటే ఓర్వలేకపోతున్నారు.’ అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

‘టీడీపీకి అనుబంధ పార్టీగా జనసేన వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో నీటితో నిండి ఉన్న నదులు పవన్‌కు కనిపించడం లేదా?. ఇసుక పేరుతో చంద్రబాబు, పవన్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. గత అయిదేళ్లు ఇసుక మాఫియా చేసిన దారుణాలపై ఎందుకు ప్రశ్నించలేదు. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి. సమస్య ఉంటే ముఖ్యమంత్రి వద్దకు వచ్చి చెప్పొచ్చుగా. అలా ఎందుకు చేయడం లేదు. 

వయసు మందగించి, అధికారం కోల్పోయి బాధ, వ్యధతో చంద్రబాబు ఆందోళనలో ఉన్నారు. మళ్లీ నన్నే రమ్మంటున్నారు అని ఆయన అంటుంటే రైతులు భయపడిపోతున్నారు. కొడుకును కొంగుచాటు బిడ్డలా కాపాడుకుంటూ.. దత్త పుత‍్రుడితో లాంగ్‌ మార్చ్‌ అంటున్నారు. చంద్రబాబుతో స్నేహం చేస్తే జనసేనకు వచ్చే ఎన్నికలు కూడా కష్టమే. ఇప్పటికైనా పవన్‌ సొంత రాజకీయాలు చేసుకోవాలి.’ అని మంత్రి అనిల్‌ కుమార్‌ హితవు పలికారు.

మరిన్ని వార్తలు