పవన్‌ గెలవడు

9 Apr, 2019 06:09 IST|Sakshi

జగన్‌ సీఎం అవుతాడని అందరూ అంటున్నారు

మీరంతా ఓట్లు వేస్తారో లేదో నాకు తెలియదు

అలీకి నేను ఎంతో సాయం చేశా

అయినా మోసం చేసి జగన్‌ పంచన చేరాడు

సీటీఆర్‌ఐ, (రాజమహేంద్రవరం)/భీమవరం అర్బన్‌/కరప/అమలాపురం : ‘ఈ ఎన్నికల్లో పవన్‌ నెగ్గడు..జగన్‌ సీఎం అవుతాడని అందరూ అనుకుంటున్నారని, పవర్‌ స్టార్‌ సీఎం..సీఎం అని అరవడం వల్ల ప్రయోజనం లేదని, మీరంతా జనసేనకి ఓట్లు వెయ్యాలని’ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రజలను వేడుకున్నారు. రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, కరప, భీమవరం మండలంలోని గూట్లపాడు రేవుల్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. టికెట్లు అమ్ముకునే దుస్థితి వైఎస్సార్‌సీపీదేనని, జనసేనది కాదన్నారు. జగన్‌ కాపు రిజర్వేషన్‌ విషయంలో పారిపోయారని ఎద్దేవా చేశారు. జగన్‌ తనకు దళితుల మీద ప్రేమ అంటారని, పులివెందుల వెళ్లి చూస్తే వారు దళితులను ఎంత ఇబ్బంది పెడతారో తెలుస్తుందన్నారు. వాళ్ల ఇళ్ల ముందు నుంచి వెళ్లేటప్పుడు చెప్పులు చేతితో పట్టుకుని వెళ్లాలని, ఇదేనా వారు దళితులకు ఇచ్చే గౌరవం అని పవన్‌ ప్రశ్నించారు.

రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ  ‘అలీ నాకు మిత్రుడు. అలీ బంధువుకి నర్సాపురం టికెట్‌ ఇచ్చాను. కానీ ఆయన ఎందుకు వైఎస్సార్‌సీపీకి ప్రచారం చేస్తున్నాడో ఆర్థం కావడం లేదని’ అన్నారు. ‘ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు.. నేను సీఎం అవుతానో లేదో నాకు తెలియదు.. మీరంతా ఓట్లు వేస్తారో లేదో నాకు తెలియదని’ అనడంతో జనం నవ్వుకున్నారు. గూట్లపాడు రేవులో జరిగిన సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ఓటు అనే ఆయుధంతో సమాజమార్పు తీసుకురావడం మీతోనే సాధ్యమని అన్నారు.    

చంద్రబాబు, జగన్‌  నన్ను అసెంబ్లీకి రాకుండా కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ‘రాయలసీమ అధికార, ప్రతిపక్షం కలిసి దోచుకుతింటారని, అక్కడ వారిని ముప్పావలా, పావలా గాళ్లు అంటారని, తెలుగుదేశం ఇసుక మాఫియాను గొయ్యితీసి కప్పెడతానని, ముఠా రాజకీయాలు చేస్తే వైసీపీని వదిలిపెట్టేది లేదని’  హెచ్చరించారు. ‘రామచంద్ర పురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మెట్ల సత్యనారాయణ కుమారుడు రమణబాబు .. నేను తెలుగుదేశం పార్టీతో లాలూచీ పడినట్టు  మాట్లాడుతున్నారు. వారి మాటలు ఉపసంహరించుకోవాలి’ అంటూ విరుచుకుపడ్డారు. కాగా, పవన్‌కల్యాణ్‌  ప్రసంగానికి స్పందన కరువైంది. చెప్పిందే చెప్పడం, ఒకటి చెబుతూ దానిని మధ్యలో వదిలేసి ఇంకోటి చెప్పడంతో సభకు హాజరైన జనం తీవ్ర అసహనానికి లోనయ్యారు. 

మరిన్ని వార్తలు