అమరావతి డిజైన్లపై పవన్‌ వ్యాఖ్యలు

18 Mar, 2018 13:08 IST|Sakshi
జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ (తాజా చిత్రం)

సాక్షి, అమరావతి : నవ్యాంధ్ర రాజధానిపై తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు చూపిస్తున్న మాస్టర్‌ ప్లాన్‌ ఫైనల్‌ది కాదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్నారు. ఆదివారం ఉదయం ఉద్దండ్రాయుని పాలెం రైతులను కలిసిన పవన్‌.. ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ మీడియాతో మాట్లాడారు. 

‘ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం అంటే అషామాషీ వ్యవహారం కాదు. అందుకు రెండు దశాబ్దాలకు పైగానే సమయం పట్టొచ్చు. అన్ని పార్టీలు రాజధానిపై కూర్చుని మాట్లాడాలి. అమరావతి కోసం ఇప్పుడీ ప్రభుత్వం చూపిస్తున్న మాస్టర్‌ ప్లాన్‌ తుదిదేం కాదు. అందుకోసం మరిన్ని చర్చలు, మార్పులు జరగాల్సి ఉంది. పార్టీలు, మేధావుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. రాత్రికి రాత్రే పెద్ద నగరం కట్టాలన్న ఆకాంక్ష ప్రభుత్వాలకు ఉంటే ఉండొచ్చు, కానీ, అందుకోసం ప్రజలను దీర్ఘకాలిక ఇబ్బందులకు గురి చేయటం సరికాదు’ అని పవన్‌ పేర్కొన్నారు. ఇక సింగపూర్‌ తరహా రాజధాని ఏర్పాటు అంటే.. పాలన కూడా అదే రీతిలో ఉంటేనే సాధ్యమౌతుందని పవన్‌ పేర్కొన్నారు.

అమరావతిలో కుల గొడవలు ఎక్కువగా ఉన్నాయని.. విశ్వనగరం నిర్మించాలంటే అందుకు విశాలమైన మనసులు కావాలని, అప్పుడే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని పవన్‌ అభిప్రాయపడ్డారు. రాజధాని రైతుల సమస్యలపై ఉన్నతస్థాయి విచారణ కమిటీగానీ.. జ్యుడీషియల్‌ విచారణగానీ జరగాలని కోరారు. ప్రభుత్వంపై పోరాటం తన అభిమతం కాదని... కేవలం పాలసీలకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తానన్నారు. తన దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారాలు లేవని..  సమస్యలు ఏవైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని పవన్‌ స్పష్టత ఇచ్చారు. ఒకవేళ అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులను ప్రజల ముందు నిలదీస్తానని పవన్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు