మ్యాజిక్కుల సీఎం చంద్రబాబు

21 Oct, 2018 04:17 IST|Sakshi
అంబుసోలిలో పర్యటిస్తున్న పవన్‌కల్యాణ్‌

     గవర్నరే ఫిదా అయ్యారు బలసలరేవు దీక్షకు మద్దతు

     చంద్రబాబు కుమారుడిని సైకిల్‌ తొక్కుకోమనండి

     జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

వజ్రపుకొత్తూరు రూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు మ్యాజిక్కులకు గవర్నరే పడిపోయారని, సామాన్య ప్రజలు ఎంతని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చమత్కరించారు. ఆయన శనివారం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో పర్యటించి తుపానుతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్‌ శాఖ మంత్రి జిల్లాలోనే పది రోజులుగా కరెంటు రాలేదంటే.. ఆయన ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. ఇంత పెద్ద విపత్తును ముందుగా ఊహించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తుపాన్‌ బాధిత గ్రామాల్లో ధరలను నియంత్రించాలని, వీలైతే ఉచితంగా నిత్యావసర వస్తువులను అందించాలన్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు యథేచ్ఛగా దోచుకుంటున్నాయని విమర్శించారు.
 
బలసలరేవు నిర్మించండి..
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం నాగావళి నదిపై వాల్తేరు గ్రామం బలసలరేవు వద్ద  వంతెన నిర్మించాలని  పవన్‌కల్యాణ్‌ కోరారు. వాల్తేరు గ్రామంలో ఆరువందల రోజులపైబడి చేపట్టిన వంతెన సాధన సమితి దీక్ష శిబిరాన్ని  ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రజా ఉద్యమం చేస్తున్న దీక్షకు జనసేన పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజావంచన పాలన కొనసాగుతోందన్నారు.  ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలే గానీ ప్రజలను వంచించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. జనసేన నేతలు మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 

లోకేష్‌ సైకిల్‌ తొక్కుకో!
చంద్రబాబుకు పదవీ వ్యామోహం అధికంగా ఉందని, తన తర్వాత లోకేష్‌ను సీఎం చేయడానికి తపన పడుతున్నారని పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. అందుకే లోకేష్‌ను ఎన్నికల్లో నిలబెట్టకుండా దొడ్డిదారిన మంత్రిని చేశారని చెప్పారు. చంద్రబాబు కుమారుడిని ఇక సైకిల్‌ తొక్కుకోమని చెప్పండంటూ జనంతో మాట్లాడే సందర్భంలో అన్నారు. అనంతరం పవన్‌ పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ అంబుసోలి గిరిజన వీధుల్లో పడిపోయిన ఇళ్లను పరిశీలించారు.

మరిన్ని వార్తలు