స్వార్థ ప్రయోజనాలే బాబుకు ముఖ్యం

3 Nov, 2018 05:52 IST|Sakshi
విజయవాడ రైల్వే స్టేషన్‌లో పవన్‌ కళ్యాణ్‌. చిత్రంలో నాదెండ్ల మనోహర్‌

తుని బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ధ్వజం

నాడు విమర్శించి నేడు రాహుల్‌తో జత కడతారా?

పొత్తుల్లేకుండా చంద్రబాబు ఎన్నికల్లో గెలవలేరు

హోదా కోసమంటూ దొంగ దీక్షలు చేస్తున్నారు

తుని రైలు విధ్వంసం ప్రభుత్వ వైఫల్యమే

జగన్‌పై హత్యాయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి

టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి

తుని/రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ)/సాక్షి, విజయవాడ: స్వార్థ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతకైనా దిగజారతారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పాటుపడరని మండిపడ్డారు. పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని గొల్ల అప్పారావు సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన  ప్రసంగించారు. రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చంద్రబాబుకు అండగా నిలిస్తే రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్‌తో కలవడం ప్రజలను వంచించడమేనన్నారు. సొంత వాళ్లను కాదని గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్‌ చేశానని చెప్పారు. నాడు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తే నేడు బీజీపీ కూడా అదే పంథాలో వెళ్తోందన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ కోసం ఢిల్లీ వెళ్లి రాహుల్‌తో ఫొటోకు చంద్రబాబు ఫోజులివ్వడం దారుణమన్నారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోసి ఇప్పడు సిగ్గు లేకుండా కాళ్లు పట్టుకుంటావా అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. కేంద్రంతో పోరాటం చేయకుండా ప్రతిపక్షాలపై బురద చల్లడం చంద్రబాబుకు అలవాటు అయిపోయిందన్నారు. పొత్తుల్లేకుండా ఎన్నికల్లో చంద్రబాబు గెలవలేరని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు ఉద్యమం చేస్తే  కేసులు పెట్టించి, తల్లిదండ్రులను బెదరించారని, ఇప్పుడు మాత్రం మీరు ధర్మ పోరాట దీక్షలు చేస్తే ప్రజలు నమ్మాలా? అని ప్రశ్నించారు. దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు యనమల దొడ్డిదారిలో మంత్రి పదవి పొంది, వియ్యంకుడికి పోలవరం కాంట్రాక్ట్‌లు ఇచ్చారన్నారు. యనమల అనుభవం అంతా వియ్యంకుడికి కాంట్రాక్ట్‌ ఇప్పించేందుకే ఉపయోగపడిందన్నారు. 

నేతలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగితే మౌనం వహిస్తారా? నాయకులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలు చాలా కీలకమైనవని, దేశంలోనే మార్పు రానుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతో జనసేనకు పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తునిలో రైలు విధ్వంసానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని, శాంతి భద్రతలు పరిరక్షించడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. అంతకు ముందు పవన్‌ విజయవాడ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో తుని వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నాం 1 గంటకు విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న పవన్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కలిశారు. రైల్వే స్టేషన్‌లో పవన్‌కు రైల్వే కూలీలు వినతిపత్రం అందచేశారు. 

హత్యాయత్నంపై వెకిలిగా మాట్లాడతారా?
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే వెకిలిగా మాట్లాడటం భావ్యం కాదని పవన్‌ అన్నారు. విజయవాడ నుంచి తునికి రైలు ప్రయాణం చేస్తూ మార్గంమధ్యలో వివిధ రైల్వేస్టేషన్లలో, రైలులోనూ పలు వర్గాల వారితో ప్రత్యేకంగా సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రతిపక్షనేతపై దాడి ఘటనను ప్రజాస్వామ్య వాదులంతా ముక్తకఠంతో ఖండించాలన్నారు. దాడిపై లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పోలీసులు దర్యాప్తులో రాజకీయ జోక్యం సరికాదన్నారు.

ఈ హత్యాయత్నంపై టీడీపీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన కుటుంబసభ్యులే చేయించారనడం టీడీపీ నేతలకు తగదన్నారు. ఎక్కడైనా అన్న, కొడుకు చనిపోవాలని చెల్లి, తల్లి కోరుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అనుభవం పార్టీలతో పొత్తులకు ఉపయోగపడుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీలో చూపించింది సినిమా ట్రైలర్‌లాగా ఉందని, అయితే సినిమా ఫ్లాప్‌ అవుతుందన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ఎక్కడ ప్రారంభించారో, చివరకు అక్కడే చేరుకున్నట్లయిందన్నారు. టీడీపీకి అధికారమే లక్ష్యంగా లక్షల ఓట్లు తీసేశారని చెప్పారు. ఈ యాత్రలో పవన్‌తో పాటు పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధరం, తోట చంద్రశేఖర్‌ ఉన్నారు. 

మరిన్ని వార్తలు