అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే

15 Aug, 2018 05:23 IST|Sakshi

మేనిఫెస్టో అమలు చేయకపోవడంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ 

భీమవరం: ఎన్నికల సమయంలో ఆర్భాటంగా మేనిఫెస్టో ప్రకటించే రాజకీయపక్షాలు అనంతరం వాటిని అమలు చేయకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. వచ్చే ఎన్నికలకు సన్నద్ధంలో భాగంగా జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఈ దార్శనిక పత్రాన్ని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారి సన్నిధిలో ఆవిష్కరించారు. మావుళ్లమ్మ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం 12 అంశాలతో కూడిన ఈ డాక్యుమెంట్‌ను విడుదల చేసి జనసేన మహిళా కార్యకర్తకు పవన్‌ అందించారు.

మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు, గృహిణులకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు, రేషన్‌కు బదులుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,500 నుంచి రూ.3,500 వరకు నగదు బదిలీ, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కాపులకు 9వ షెడ్యూల్‌ ద్వారా రిజర్వేషన్లు కల్పించడం, ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు, ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ సూచనల అమలు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం సీపీఎస్‌ విధానం రద్దు, వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు ఏర్పాటు వంటి అంశాలను ఈ విజన్‌ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. మేనిఫెస్టో సంపూర్ణ ప్రతిని త్వరలోనే విడుదల చేస్తామని ఈ సందర్భంగా పవన్‌ తెలిపారు. ఆడబడుచులకు జనసేన పూర్తి భద్రత కల్పిస్తుందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు