టీడీపీ అవినీతిమయమైంది

8 Oct, 2018 02:49 IST|Sakshi

పోలవరం రూరల్‌: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిమయమైందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. బలమైన సుపరిపాలనకోసం టీడీపీకి మద్దతిచ్చానని, కానీ టీడీపీ అవినీతిమయంగా తయారైందని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు తాను చెప్పిన సుపరిపాలన తప్ప అన్నీ చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో ఇసుక మాఫియా పెరిగిందన్నారు.

జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీరాజ్‌ వ్యవస్థను పాలకులు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. పోలవరం మండలం పట్టిసం గ్రామంలోని రివర్‌ ఇన్‌ గెస్ట్‌హౌస్‌ వద్ద ఆదివారం జనసేన సమావేశం నిర్వహించారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి జనసేనలో చేరారు. ఈ సందర్భంగా, అలాగే ఏజెన్సీలో పనిచేస్తున్న గిరిజన ఉపాధ్యాయులు, సత్యసాయి వర్కర్లు, నిర్వాసితులు, పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలోనూ పవన్‌ మాట్లాడారు.

కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదు
శక్తి, బలం ఉండి, ఇంట్లో కూర్చొనే బతుకు ఓ బతుకేనా అనిపించి రాజకీయాల్లోకి వచ్చానని, గెలుపోటముల గురించి పట్టించుకోనని, కులాన్ని, వర్గాలను నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని పవన్‌ అన్నారు. తాను పార్టీ పెట్టింది వ్యక్తిగతంగా ఎదగడానికి కాదని, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికని పేర్కొన్నారు. కులం కట్టుబాటు.. వ్యవస్థకు కట్టుబడి ఉండాలిగానీ, రాజకీయాలను శాసించేలా ఉండకూడదన్నారు.

తన పార్టీలోకి చేరేవారిని తాను డబ్బులు అడగనని, సేవ చేసే గుణం ఉంటే చాలన్నారు. తాను కష్టాల్లో పార్టీ పెట్టానని, పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్‌లాగా ఉప్పెన లేదని, చిరంజీవిలాగా ప్రవాహం లేదని, ఎదురీదుతూ పార్టీపెట్టానని చెప్పారు. తనకు జగన్‌ శత్రువు కాదని, తనకు ఎవరూ శత్రువులు లేరన్నారు. దెందులూరులో ప్రజాప్రతినిధి కులం పేరుతో తిడుతున్నా, కొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

ఐటీ సోదాలను సీఎం తప్పుపట్టడం దారుణం..
ఐటీ సోదాలపై సీఎం వ్యాఖ్యలు సరైనవి కావని పవన్‌ అన్నారు. ఎక్కడో జరిగే సోదాలను తప్పుబట్టడం దారుణమన్నారు. ఐటీ సోదాలు చేస్తున్నారని కన్నీరు కారిస్తే సానుభూతి రాదన్నారు. సీఎం ఇంటిమీదో, ఢిల్లీలో చీఫ్‌ సెక్రటరీ ఆఫీస్‌పైనో దాడులు చేస్తే ఖండించాలి తప్ప ఎక్కడో ప్రైవేటు సంస్థల్లో సోదాలు జరుగుతుంటే ఖండించడమేంటని ప్రశ్నించారు.

సొంత ఇంటి నిర్మాణం సందర్భంగా సీఎం కుటుంబం హోటల్లో ఉంటే రూ.కోట్లు ఖర్చు చేశారని, అయితే సంక్షేమ వసతిగృహాలకు మాత్రం కనీస సౌకర్యాలు  కల్పించడం లేదన్నారు. ప్రజాప్రతినిధులు రూ.లక్షల్లో జీతం తీసుకుంటున్నా, వారి పనితీరుపై ఏ తనిఖీలూ లేవని విమర్శించారు. అదే సామాన్యుడైన టీచర్‌పై ఎన్నో తనిఖీలున్నాయన్నారు. ఏజెన్సీలో యంత్రాంగం పనితీరు చతికిలబడిందన్నారు.

మరిన్ని వార్తలు