బీజేపీలో జనసేనను విలీనం చేస్తారా?

4 Dec, 2019 14:18 IST|Sakshi

సాక్షి, తిరుపతి: బీజేపీకి తాను ఎప్పుడూ దూరం కాలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. తిరుపతిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అంటే గౌరవం తనకు చాలా గౌరవమని చెప్పారు. కేంద్రంలో బీజేపీ మంచి పాలన చేస్తోందని కితాబిచ్చారు. బీజేపీలో జనసేన పార్టీని విలీనం చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. విలీనం గురించి ఇప్పుడే చెప్పలేనని సమాధానం ఇచ్చారు.

కాగా, పవన్‌ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పవన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా పలు ఊహాగానాలు వచ్చాయి. బీజేపీ అగ్ర నాయకత్వంతో రహస్యంగా మంతనాలు జరిపేందుకే పవన్‌ ఢిల్లీ వెళ్లారన్న ప్రచారం జరిగింది. అయితే ప్రైవేటు పర్యటన కోసమే ఢిల్లీ వెళ్లారని జనసేన నాయకులు వివరణయిచ్చారు. ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత పవన్‌ మాట తీరు మారిందని, బీజేపీకి దగ్గరయ్యేలా ఆయన మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి. జనసేన పార్టీని బీజేపీలో కలిపేసేందుకు ఆయన అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోంది. ఈ వార్తలను ఆయన ఖండించకపోవడం చూస్తుంటే త్వరలోనే బీజేపీలో జనసేన కలిసిపోవడం ఖాయమన్న వాదన బలంగా విన్పిస్తోంది. మరోవైపు ‘దిశ’ ఘటనపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై జనం మండిపడుతున్నారు. (‘బెత్తంతో కొట్టడానికి వాళ్లు చిన్నపిల్లలు కాదు’)

మరిన్ని వార్తలు