పాలకుల నిర్లక్ష్యం వల్లే ఉత్తరాంధ్ర వెనుకబాటు

28 Jun, 2018 03:28 IST|Sakshi

     జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

     మలివిడత పోరాట యాత్ర ప్రారంభం

సాగర్‌నగర్‌ (విశాఖ తూర్పు): పుష్కలమైన వనరులు, సుదీర్ఘ చరిత్ర ఉన్న ఉత్తరాంధ్ర వెనుకబాటుకు పాలకులే ప్రధాన కారణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మండిపడ్డారు. రుషికొండలోని ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో బుధవారం ఉత్తరాంధ్ర మేధావులతో కలిసి మలి విడిత పోరాట యాత్ర ప్రారంభించారు. తర్వాత జన స్వరం–ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం–పరిష్కారం అనే అంశంపై ఉత్తరాంధ్ర మేధావులతో చర్చా కార్యక్రమం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమావేశానికి యూపీఎస్‌ విశ్రాంతి సభ్యులు ప్రొఫెసర్‌ కె.ఎస్‌.చలం సమన్వయకర్తగా వ్యవహరించారు. సదస్సులో పవన్‌ ప్రారంభోపన్యాసం చేస్తూ.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు, ఈ ప్రాంత పరిస్థితులు వింటుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత భవిష్యత్తు ప్రణాళికలపై మేధావులు విశ్లేషణ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

రాయలసీమలోని అనంతపురంలో నీటి వనరులు లేక ప్రజలు వలసబాట పడుతుండటం చూశామని, అయితే శ్రీకాకుళంలో అన్నివనరులు ఉండీ ఉపాధి కోసం యువత వలస పోతుండటం అత్యంత దారుణమన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రాధాన్యం కలిగిన వంశధార ప్రాజెక్టు కోసం బంగారం పండే వేల ఎకరాల భూములను కార్పొరేట్‌ సంస్థలు కొనుగోలు చేసి, ఆ రైతులనే వలస కూలీలుగా మార్చిన వైనంపై ఆందోళన వ్యక్తం చేశారు. తాను పర్యటించిన ప్రాంతాల్లో భూ దాతలతో మాట్లాడిన సమయంలో పదిమంది బాగు కోసం తమ భూములిచ్చాం బాబూ.. కానీ తమకు అన్యాయం చేశారని రైతులు చెప్పడంతో గుండె తరుక్కుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

లక్షలాది ఎకరాల భూములను ఇతర ప్రాంతాలకు చెందిన సెటిలర్లు ఆక్రమించుకుని కొనుగోలు చేసి, స్థానికులను బానిసలుగా మార్చేశారని, కోట్లాది నిధులు దోచుకుంటున్నారని విమర్శించారు. వంగపండు ప్రసాదరావు రచించి పాడిన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, జనసేన ఆవిర్భావంపై ప్రజల ఆశాభావం గీతం అందరినీ ఆకట్టుకుంది. సమావేశంలో ఏయూ విశ్రాంతి వైస్‌ చాన్స్‌లర్‌ కె.వి.రమణ, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం కన్వీనర్‌ అజశర్మ, సభ్యుడు నరవ ప్రకాశరావు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు