రాజధాని మార్చొద్దు

1 Jan, 2020 04:18 IST|Sakshi

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ 

అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటానని హామీ

సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్‌: రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి మార్చొద్దని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. రాజధాని రైతులు రోడ్డున పడడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే కారణమని ఆరోపించారు. ఆయన మంగళవారం అమరావతి ప్రాంతంలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, మందడం, తుళ్లూరులో పర్యటించారు. తుళ్లూరు మండలంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

రాజధాని ప్రాంతంలో రైతులు కులాలు చూసి తమ భూములను త్యాగం చేయలేదని అన్నారు. అమరావతిపై జగన్‌మోహన్‌రెడ్డికి అభ్యంతరాలు ఉంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే అసెంబ్లీలోనే వ్యతిరేకించి ఉండాల్సిందన్నారు. ప్రస్తుతం సీఎం చేసిన ప్రకటనతో ఇళ్లలో ఉన్న రైతుల పిల్లలు, మహిళలు, రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఉద్దానం బాధితులకు అండగా జనసేన పోరాడినట్లు రాజధాని ప్రాంత రైతుల కోసం పోరాడుతుందని హామీ ఇచ్చారు. రాజధానిని అమరావతి నుంచి మార్చడం సాధ్యం కాదని అన్నారు. 

పోలీసులతో పవన్‌ వాగ్వాదం 
రాజధాని నిర్మాణం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, నాలుగేళ్లలో ఎంత ఖర్చు పెట్టారో, ఏ మేరకు నిర్మాణాలు పూర్తి చేశారో ఆ పార్టీ నాయకులు ప్రజలకు వివరించలేకపోయారని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. రాజధానికి 33 వేల ఎకరాల భూములు అవసరం లేదని తాను ఆనాడే చెప్పానని గుర్తుచేశారు. అంతా పూర్తయ్యాక తనను ప్రశ్నించడం వల్ల ఉపయోగం ఏముంటుందని రైతులను ప్రశ్నించారు.

మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న అమరావతి ప్రాంత రైతులకు పవన్‌ సంఘీభావం తెలిపారు. కాగా, కృష్ణాయపాలెం నుంచి మందడం వెళ్లేందుకు పవన్‌ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెంబడి నేరుగా తుళ్లూరుకు వెళ్లాలని సూచించడంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. మందడంలో రైతులు చేస్తున్న నిరసన దీక్షకు తాను వెళ్లాలని, పోలీసులు తనను ఎలా అడ్డుకుంటారో చూస్తానంటూ పరుష వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు