శవాలపై పేలాలు ఏరుకుంటారా?

23 Oct, 2018 04:29 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్, పక్కన నాదెండ్ల మనోహర్‌.

సీఎం తీరుపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఆగ్రహం

సాయంలోనూ వివక్ష చూపితే ఎలా అని మండిపాటు

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను బాధితులకు సాయమందించడంలో వివక్ష చూపిస్తున్నారని, వైఎస్సార్‌సీపీ, జనసేన మద్దతుదారులున్న ప్రాంతాల్లో సాయమందించకపోగా వారిని బెదిరిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ధ్వజమెత్తారు. టీడీపీకి ఓట్లేసే వారికే తప్ప ఇతర పార్టీల వారికి సాయం చేయడం లేదన్నారు. సోమవారం విశాఖ శివారులోని సాయిప్రియ రిసార్ట్సులో ఆయన మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించి వారి కష్టాలను చూసి వచ్చానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వాసులు కష్టాల్లో ఉంటే చంద్రబాబు విజయోత్సవాలకు సిద్ధం కావడం శవాలపై పేలాలు ఏరుకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఇంతటి విషాదంలోనూ సీఎం ప్రచారం కోసం పాకులాడడం దారుణమన్నారు. ప్రధాని వ్యక్తిగత కోపతాపాలు వీడి తుపాను పీడిత రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు.  

మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు  శ్రీకాకుళం జిల్లాను గాలికొదిలేశారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను విధ్వంసంపై గవర్నరు స్పందన సరిగా లేదన్నారు.  ఐఎండీ ముందుగా హెచ్చరికలు జారీ చేసినా.. అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్లే అపారనష్టం జరిగిందని, ఇది ప్రభుత్వ వెఫల్యమేనన్నారు. ఉద్దానం ప్రాంతంలో పంటలు, తోటలు నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ చేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. నష్టపరిహారం అందచేయడంలో జన్మభూమి కమిటీలు జోక్యం చేసుకుని బాధితులకు అన్యాయం చేస్తున్నాయన్నారు. తిత్లీ నష్టంపై ప్రధానమంత్రికి సమగ్రంగా లేఖ రాస్తామని తెలిపారు. మత్స్యకారులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ పాదయాత్రలో ఉన్నందున బాధితుల పరామర్శకు రాలేదేమోనని  ఓ  ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

మరిన్ని వార్తలు