ప్రత్యేక హోదాను మరచిన గజినీ చంద్రబాబు

28 Jan, 2019 03:31 IST|Sakshi

ఐదేళ్లు కావస్తున్నా సంపూర్ణ రాజధాని కట్టలేకపోయారు

అధికారంలోకి రావడానికి జనసేనను వాడుకున్నారు

అవసరం కోసం అవినీతిపరులను కూడా పార్టీలో చేర్చుకుంటా 

హోదా కోసం 29న ఉండవల్లి ఏర్పాటు చేసిన వేదికలో పాల్గొంటా

వైఎస్సార్‌సీపీ వస్తే అందరం కలిసి పోరాడదాం..ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేద్దాం 

గుంటూరు జనసేన శంఖారావ సభలో పవన్‌కళ్యాణ్‌  

సాక్షి, గుంటూరు: ప్రత్యేక హోదాను సీఎం చంద్రబాబు పదేపదే గజినీలా మర్చిపోతున్నారని, ఆయనకు ప్రత్యేకహోదా ఆరునెలలకోసారి గుర్తుకువస్తుందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు అవసరానికి అనుగుణంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గుంటూరులో ఆదివారం జరిగిన జనసేన శంఖారావ సభలో ఆయన ప్రసంగించారు. గుంటూరుకు చేరుకున్న పవన్‌  ఇన్నర్‌ రింగ్‌రోడ్డులోని జనసేన జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లు పూర్తయినా సంపూర్ణ రాజధానిని నిర్మించలేకపోయారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి జనసేన పార్టీని వాడుకున్న చంద్రబాబు సమస్యలు వచ్చినప్పుడు తమను నిర్లక్ష్యం చేశారని, సభలు పెట్టుకుంటే బ్యానర్‌ చించుతున్నారని చెప్పారు. ఈ నెల 29న ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ప్రత్యేక హోదా కోసం ఏర్పాటు చేసిన వేదికలో తాను పాల్గొంటానని, వైఎస్సార్‌సీపీ కూడా వస్తే అందరం కలిసి హోదా కోసం పోరాడదామని అన్నారు. ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేద్దామా ఎలా పోటీ చేద్దాం అనే విషయం తర్వాత చూసుకుందామన్నారు. అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తులని తెలిసినా గెలవాల్సిన పరిస్థితి ఉంటే అవసరం కోసం వారిని పార్టీలో చేర్చుకుంటానన్నారు. 

గుంటూరు పార్లమెంట్‌కు తోట, తెనాలి అసెంబ్లీకి మనోహర్‌
జనసేన రాష్ట్ర నాయకులు తోట చంద్రశేఖర్‌ గుంటూరు ఎంపీగా, నాదెండ్ల మనోహర్‌ తెనాలి శాసన సభకు జనసేన తరపున పోటీ చేస్తారని పవన్‌  ప్రకటించారు. మాజీ మంత్రి రావెల  2009 నుంచి తనకు తెలిసిన వ్యక్తి అని చెప్పిన పవన్‌ ఆయనకు ఎక్కడ సీటు ఇస్తున్న విషయం మాత్రం చెప్పలేదు.   

మరిన్ని వార్తలు