చంద్రబాబుకు రైతుల కన్నీరు పట్టదు

29 May, 2018 02:57 IST|Sakshi

     జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విమర్శ

     హోదా కోసం పోరాటం అంటూ బాబు మోసం 

     భూ కబ్జాలు, ఇసుక మాఫియా కోసం అధికారాన్ని వాడుకుంటున్నారు

     బాబు పాలనలో ఉత్తరాంధ్రకు అన్యాయం

పాలకొండ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రైతుల కష్టాలు పట్టవని, వారి కన్నీరు గుర్తించడంలేదని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో సోమవారం ఆయన పోరాట యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడానికి అందరి సహకారం పొంది ఇప్పుడు ఒంటరిగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామంటూ మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు మేలు చేస్తారని గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చానని.. అయితే నాలుగేళ్లుగా ఆయన తీరు మారలేదన్నారు. అధికారాన్ని కేవలం భూ కబ్జాలు, ఇసుక మాఫియా కోసం వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు.  

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో టీడీపీ అరాచకాలను గుర్తించామన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ భూకబ్జాలు, ఇసుక మాఫియాతో నిండిపోయిందన్నారు. మంత్రి కళా వెంకటరావు, విప్‌ కూన రవికుమార్‌ల నియోజకవర్గాల్లో ఇసుకను దర్జాగా దోపిడీ చేస్తున్నారన్నారు. వేల కోట్లు దండుకుంటున్న నాయకులు రైతులకు కనీసం సాగునీరు కూడా అందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ఇక్కడి డబ్బులు హైదరాబాద్‌లో పెట్టి ఈ ప్రాంతాలకు అన్యాయం చేశారని, ఇప్పుడు కూడా అమరావతి పేరుతో ప్రజల డబ్బును ఒకే చోట కుమ్మరిస్తున్నారని విమర్శించారు.

వెనుకబడిన జిల్లాలకు కనీసం నిధులు అందించడంలేదన్నారు. తోటపల్లి, వంశధార ప్రాజెక్టులు కూడా సకాలంలో పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్ర జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. టీడీపీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్‌ పేరును చెడగొడుతూ ఆ పార్టీని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరించాలని, ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలన్నారు. ప్రత్యేక హోదాతోనే యువతకు ఉపాధి దొరుకుతుందని.. అందుకోసం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు