రిసార్ట్స్‌లో పవన్‌ కల్యాణ్‌ దీక్ష

25 May, 2018 19:29 IST|Sakshi
రిసార్ట్స్‌లో దీక్షకు కూర్చున్న పవన్‌ కల్యాణ్‌(తాజా చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌: ఉద్దానం కిడ్నీ బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకరోజు దీక్ష చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రస్తుతం తాను బసచేసిన ఎచ్చెర్ల డాట్లా రిసార్ట్స్‌లోనే శుక్రవారం సాయంత్రం నుంచి ఆయన దీక్షలో కూర్చున్నారు. 24 గంటలపాటు ఈ దీక్ష కొనసాగనుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్‌ ప్రజల మధ్యే దీక్ష చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్‌ దీక్షకు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సంఘీభావ దీక్షలు జరుగుతాయని జనసేన పార్టీ నాయకులు మాదాసు గంగాధర్‌, అద్దేపల్లి శ్రీధర్‌లు తెలిపారు. ఉద్దానం బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యసేవలు అందించేదాకా జనసేన పోరాడుతూనేఉంటుందని వారు చెప్పారు.

బౌన్సర్లు లేక ఆగిన యాత్ర: జన పోరాట యాత్ర పేరులో మే 20 నుంచి పవన్‌ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర అనూహ్య కారణాల వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రభుత్వం భద్రత కల్పించడంలేదని ఆరోపిస్తోన్న పవన్‌.. ప్రైవేటు సెక్యూరిటీ(బౌన్సర్ల) సాయంతో యాత్రను కొనసాగిస్తున్నారు. పలు చోట్ల స్థానికులు, అభిమానులతో బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించడం, ఒక దశలో దెబ్బలాటకు దిగడం, ఈ క్రమంలో బౌన్లర్లూ గాయపడటం, ఆస్పత్రిపాలుకావడం తెలిసిందే. ప్రైవేటు సెక్యూరిటీ లేని కారణంగా పవన్‌ యాత్ర గురు, శుక్రవారాల్లో వాయిదాపడింది. ఇక ఒక్క రోజు దీక్ష చేస్తుండటంతో శనివారం కూడా యాత్ర లేనట్లే.

 

మరిన్ని వార్తలు