పర్సంటేజీల కోసం ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకున్నారు

25 Jun, 2018 04:00 IST|Sakshi

  నేడు దీక్షలు చేస్తున్న వారే నాటి పర్సంటేజీల దోషులు

  పవన్‌ కళ్యాణ్‌ ఆరోపణ

  జిందాల్‌ కంపెనీ ఫ్యాక్టరీ పెట్టడానికి గతంలోనే ముందుకొచ్చిందని వెల్లడి

  టీడీపీ వాళ్లకు అనుకూలమైన వారు లేనందునే ఫ్యాక్టరీని రానీయలేదు

  ప్రభుత్వ పెద్దలకు పర్శంటేజీలు ఇస్తేనే పరిశ్రమలు పెట్టే పరిస్థితి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం గొడవ చేస్తున్న వారే పర్సంటేజీల కోసం గతంలో అడ్డుకున్నారని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ తీవ్రారోపణ చేశారు. జిందాల్‌ కంపెనీ అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చినప్పుడు అందులో వారికి వాటాలొచ్చే నిబంధనలు లేవనే భావనతో ఫ్యాక్టరీనే రాకుండా అడ్డుపడ్డారని పవన్‌ స్పష్టమైన ఆరోపణ చేశారు.  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి ఆదివారం రాత్రి ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..తనకున్న సమాచారం మేరకు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని జిందాల్‌ కంపెనీ ముందుకొచ్చిందన్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీ కావాలని గొడవ చేస్తున్న టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కొందరు.. ఆ జిందాల్‌ కంపెనీ ప్రతిపాదన వాళ్లకు అనుకూలంగా, లాభం కలిగించేదిగా లేదని అప్పుడు పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పుకోలేదని చెప్పారు.

టీడీపీకి చెందిన వ్యక్తులకు లాభం కలిగే పరిస్థితులు లేనప్పుడు ఫ్యాక్టరీ అనుమతులు నిరాకరించడం.. వాళ్లకు లాభంగా ఉంటుందని అనుకున్నప్పుడే ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుమతి తెలపడం వంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇప్పుడున్నాయని వివరించారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వంలో, టీడీపీ నేతల్లో ద్వంద విధానం కనిపిస్తోందన్నా్డరు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి..ఇప్పుడు గొడవ చేస్తున్న వారికి లబ్ధి చేకూరే పరిస్థితి ఉంటే తప్ప ఆ ఫ్యాక్టరీ మొదలు కాదన్నారు. ఇలాంటి పరిస్థితుల వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే పరిస్థితులు లేకుండా పోతున్నాయని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుందని, ప్రాంతీయ విభేదాలు సైతం తలెత్తే పరిస్థితులు ఏర్పడ్డయ్యాన్నారు. అరాచక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం స్వచ్ఛమైన పాలన ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు పాలన చూస్తుంటే చేసిన తప్పులనే మళ్లీ చేస్తున్నారు తప్పితే సరిదిద్దుకునే పరిస్థితులు లేవన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు వైఎస్సార్‌ కడప జిల్లాలో ఈ నెల 29వ తేదీన ప్రతిపక్షాలు నిర్వహించే బంద్‌కు వామపక్షాలు, జనసేన పార్టీ మద్దతు, సంఘీభావం ప్రకటిస్తున్నట్టు తెలిపారు.   

మరిన్ని వార్తలు