చంద్రబాబు, పవన్‌ ఒక్కటే!

29 Mar, 2019 03:11 IST|Sakshi

టీడీపీ నేత, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్‌ రమణబాబు స్పష్టీకరణ 

అమలాపురం టౌన్‌: ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసైనా.. ఎన్నికల్లో గట్టెక్కాలనే దురుద్దేశంతో సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ మధ్య  చీకటి ఒప్పందాలు కొనసాగుతున్నాయని జనం నుంచి వస్తున్న విమర్శలకు టీడీపీ అంతర్గత సమావేశంలో ఆ పార్టీ నేత వెల్లడించిన విషయాలు మరింత బలాన్ని ఇస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని  రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్, టీడీపీ నేత మెట్ల రమణబాబు నివాసంలో గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఇద్దరూ ఇప్పుడు కలిసే ఉన్నారు. వారిద్దరూ ఒక అవగాహనతోనే ఉన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలకు ఈ విషయాన్ని చెప్పాలి’ అని పిలుపునిచ్చారు. దీంతో కార్యక్రమానికి హాజరైన టీడీపీ కార్యకర్తలు నిశ్చేష్టులయ్యారు. రమణబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మధ్య ఉన్న బంధాన్ని వివరించారు.

‘జనసేనలో కాపు యువత కావచ్చు లేదా వేరే యువత కావచ్చు..జనసేన అన్నప్పుడు మనం వివరించి చెప్పాలి. వారందరికీ ఒకటే విషయాన్ని చెప్పండి..మీ ఓటు వృథా చేయవద్దు.. ఈ సారికి ఇలా చేయండి.. తర్వాత పవన్‌కల్యాణ్‌కు ఇంకా వయస్సు ఉంది. భవిష్యత్‌ ఉంది.. ఆయన సంగతి అప్పుడు అలోచిద్దాం’ అని చెప్పండని రమణబాబు పార్టీ నాయకులకు సూచించారు. ‘ఎందుకంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌  బద్ధశత్రువులుగా లేరు. గతంలో మధ్యలో చిన్న డిస్ట్రబెన్స్‌ క్రియేట్‌ అయిందే తప్ప వారిద్దరి మధ్య ఏ విధమైన పొరపచ్చాలు లేవు. ఇప్పుడు కూడా ఇద్దరూ కలిసే ఉన్నారు. ఇదే విషయాన్ని జనసేన నాయకులు, కార్యకర్తలకు చెప్పండని’ వివరించారు. దీంతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ మధ్య కొనసాగుతున్న చీకటి పొత్తు, అవగాహన, సీట్ల సర్ధుబాట్లు తేలతెల్లమవుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, రమణబాబు ప్రసంగం టీవీ చానళ్లలోనూ, సోషల్‌ మీడియాలోనూ చక్కర్లు కొడుతుండడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయమై సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తూ తమ పంథాలో స్పందిస్తున్నారు.  

మరిన్ని వార్తలు