నరంలేని నాలుక మాదిరి సీఎం మాటలు

2 Dec, 2018 04:32 IST|Sakshi

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ధ్వజం 

అవినీతిలో లోకేశ్‌ది వాళ్ల నాన్న పోలికే 

పార్టీలోకి చేరిన టీడీపీ ఎమ్మెల్యే రావెల కిశోర్‌ బాబు

సాక్షి, అమరావతి: నరం లేని నాలుక ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుందన్న సామెత మాదిరిగా సీఎం చంద్రబాబు ఏమైనా మాట్లాడతారని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు శనివారం జనసేన పార్టీలోకి చేరిక సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఒక రోజు బీజేపీని నెత్తికెత్తుకుంటారని, సన్మానాలు కూడా చేయించారని, తనకు నచ్చనప్పుడు తిడుతున్నారని విమర్శించారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు కాస్తయినా జ్ఞానం వచ్చి ఉంటుందని, అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉంటారనుకుని 2014లో మద్దతు పలికినట్లు తెలిపారు. ‘అవినీతి రహిత పాలన వస్తుందని ఆశించా. కానీ ఏ మూలకెళ్లినా, ఏ నియోజకవర్గానికెళ్లినా వేల కోట్ల అవినీతి, శాంతిభద్రతలు కరువైన పరిస్థితులు, కుల రాజకీయాలు, ఆడపడుచుల మీద, అధికారుల మీద ఎమ్మెల్యేలు దాడులు చేసే పరిస్థితొచ్చింది. పాలన మీద సీఎంకు పూర్తిగా పట్టు తప్పింది’ అని ధ్వజమెత్తారు. ఇప్పుడు చంద్రబాబు వయసు అయిపోతోందని ఆయన చెబుతున్నట్టుగా విజన్‌ 2050 ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని సీఎం అంటున్నారని.. తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. అవినీతిలో లోకేశ్‌ది కూడా వాళ్ల నాన్న పోలికేనన్నారు. 

పార్టీ మారితే పదవికి రాజీనామా చేయాలి 
పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. సీఎంగారూ రావెలను చూసి నేర్చుకోండంటూ.. హితవుపలికారు. పార్టీ సభ్యతానికి రాజీనామా చేసేటప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలన్నారు. 2019లోనూ రావెల కిషోర్‌బాబు ఎమ్మెల్యేగా గెలుస్తారని, మంత్రి కూడా అవుతారని పవన్‌ చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, పసుపులేటి బాలరాజు పాల్గొన్నారు.

టీడీపీలో దళితులకు పదవులిచ్చినా అధికారమివ్వరు:రావెల
టీడీపీ ప్రభుత్వంలో దళిత, గిరిజనులకు పదవులు దక్కినా వాటికి సంబంధించిన అధికారాన్ని మాత్రం దక్కనీయడం లేదని మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సంచలన ఆరోపణ చేశారు. టీడీపీలో దళిత, గిరిజన ప్రజాప్రతినిధులు అవమానాలకు గురవుతున్నారని ఆరోపించారు. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన ఆయన శనివారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రావెల దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు తనను మంత్రిని చేసినా ఆమేరకు పనిచేయనీయకుండా అవరోధాలు, ప్రతిబంధకాలు సృష్టించి.. అడుగడుగునా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు