ఆభరణాల గురించి టీడీపీ నాయకులకు తెలుసు : పవన్‌

21 Jun, 2018 11:30 IST|Sakshi
జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (పాత ఫోటో)

సాక్షి, హైదరాబాద్ : భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే భూ కబ్జాలకు అండగా నిలుస్తోందంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. గురువారం వరుస ట్వీట్లలో రాష్ట్ర ప్రభుత్వం తీరును ఆయన ఎండగట్టారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటివరకూ సేకరించిన భూములు చాలని, ఇకపై రైతుల నుంచి భూములను సేకరించొద్దని ప్రభుత్వానికి సూచించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో జరుగుతున్న పరిణమాలపై కూడా పవన్‌ స్పందించారు. రమణ దీక్షితులు ప్రస్తావిస్తున్న అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. పింక్‌ డైమండ్‌తో పాటు ఇతర ఆభరణాల అదృశ్యంపై ప్రభుత్వం ఇచ్చిన వివరణ సరిగా లేదని అన్నారు.

కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో తనను కలిసిన ఓ వ్యక్తి టీటీడీ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారని ట్వీట్‌లో పవన్‌ పేర్కొన్నారు. ఆయన చెప్పిన ప్రకారం వేంకటేశ్వర స్వామి వారి ఆభరణాలు ఓ మిడిల్‌ ఈస్టర్న్‌ దేశానికి తరలిపోయాయని రాసుకొచ్చారు. ఈ విషయం కొంతమంది టీడీపీ నాయకులకు తెలుసని సంచలన విషయాన్ని బయటపెట్టారు. అందుకే రమణ దీక్షితుల ఆరోపణలు తనకు ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇవ్వలేదని చెప్పారు. ఆభరణాలను దొంగిలించిన వారు బాలాజీ మాట్లాడలేరని, ఆయన్ను దోచుకుంటే ఏం కాదని అనుకుంటున్నారని అన్నారు.

మరిన్ని వార్తలు