చంద్రబాబు అనుభవం కాంగ్రెస్‌కు జైకొట్టేందుకేనా...!

14 Nov, 2018 08:09 IST|Sakshi
రామచంద్రపురం బహిరంగ సభలో ప్రసంగిస్తున్న పవన్‌ కల్యాణ్‌

సీఎం పదవిపై ఆశలేదు..

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌

పార్లమెంటులో తలుపులు మూసివేసి రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా విభజిస్తే సీఎం చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం కాంగ్రెస్‌ పార్టీకి  జై కొట్టేందుకు ఉపయోగపడిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రామచంద్రపురంలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ఘాటుగా విమర్శించారు. చివరకు టీడీపీ నేతలు కోడి కత్తులతో హత్యా రాజకీయాలకు పాల్ప డే స్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు.

తూర్పుగోదావరి,బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సీఏం పదవిపై వ్యామోహం లేదని, రాజకీయ వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆ పార్టీ ప్రజా పోరాట యాత్ర రెండో విడతలో భాగంగా మంగళవారం కాకినాడ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్లో ముస్లింలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముస్లిం మహిళలు మాట్లాడుతూ చదువుకోవడానికి కనీస అవసరాలు కల్పించడం లేదని, ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరడం లేదని, చాలామంది తమకు ఇళ్లు అద్దెకు ఇవ్వడం లేదని తెలిపారు. దీనిపై ఆయన స్పందిస్తూ ముస్లింలను ఓటు బ్యాంకులా కాకుండా వారి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని, బీజేపీ హిందువుల పార్టీ కాదని, అది రాజకీయ పార్టీ అని, జనసేన ముస్లింలకు మద్దతుగా నిలబడుతుందన్నారు.

రెల్లి కులస్తులకు అండగా నిలుస్తా..
పారిశుద్ధ్య విభాగంలో కీలకంగా ఉన్న రెల్లి కులస్తులకు అండగా నిలుస్తానని పవన్‌ అన్నారు. రెల్లిపేటలో ఆయన పర్యటించారు. రెల్లి కులస్తులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేలా జనసేన అడుగులు వేస్తుందన్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని పారిశుద్ధ్య కార్మికులకు శాపంగా ఉన్న 279 జీఓను రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ నాయకులు ముత్తా శశిధర్, పంతం నానాజీ, విజయ గోపాల్, శెట్టిబత్తుల రాజబాబు, పీఏంపీల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు