తుపాను తీవ్రతను ప్రధాని దృష్టికి తీసుకెళతా

18 Oct, 2018 03:03 IST|Sakshi
అమలపాడు రోడ్డు షోలో మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌

బాధితులకు పదేళ్లదాకా నష్టపరిహారమందించాలని కోరతాజనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను సృష్టించిన విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు పదేళ్లపాటు బాధితులకు నష్ట పరిహారం అందించాలని కోరుతూ లేఖ రాస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని దేవునల్తాడ, భావనపాడు, పొల్లాడ, పాతటెక్కలి తదితర గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించారు. సూర్యమణిపురం, పాతటెక్కలి, అమలపాడు ప్రాంతాల్లో తుపాను ధాటికి దెబ్బతిన్న జీడి, కొబ్బరి తోటలను పరిశీలించారు.

అనంతరం అమలపాడు గ్రామంలో తుపాను బాధిత జీడి, కొబ్బరి రైతులనుద్దేశించి మాట్లాడారు. తుపాను కారణంగా ఉద్దానం 30 ఏళ్లపాటు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. ఉద్దానం ప్రజల జీవితాలే కూలిపోయాయని, వారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వెలిబుచ్చారు. సహాయ చర్యలపై తమ పార్టీకి చెందిన బృందాలతో పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే రాష్ట్రప్రభుత్వం విషయంలో స్పందిస్తానని చెప్పారు. అమలపాడు మాజీ సర్పంచ్‌ దున్న షణ్ముఖరావు మాట్లాడుతూ.. గ్రామంలో వారంతా నిరుపేదలని, కొబ్బరి మొక్కలు వేసి అవి కాపునకు రావాలంటే పదేళ్లు పడుతోందని.. ఈలోగా తాము బతికేదెలా అంటూ వాపోయారు. పవన్‌ స్పందిస్తూ.. బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు తాను ఉద్దానం ప్రాంతంలో మూడు రోజులు పర్యటిస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని గట్టిగా అడుగుతానని చెప్పారు.

మరిన్ని వార్తలు