చంద్రబాబు ఆదేశాలతో.. రూట్‌ మార్చిన పవన్‌!

13 Jan, 2020 20:47 IST|Sakshi

న్యూఢిల్లీ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రూట్‌ మార్చారు. ఎన్నికల్లో ఘోర ఓటమితో బీజేపీ వైపు వచ్చేందుకు పవన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే ఆయన బీజేపీ చుట్టూ తిరుగుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు కోసం పవన్‌ బీజేపీ జపం చేస్తున్నారు. మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన పవన్‌కు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. చివరకు బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాతో పవన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీతో కలిసి పనిచేస్తానంటూ నడ్డాకు పవన్‌ చెప్పినట్టుగా సమాచారం. అయితే నడ్డా మాత్రం ఈ అంశంపై ఏపీ బీజేపీ ఇంచార్జ్‌లతో చర్చలు జరపాలని పవన్‌కు సూచించారు. 

నడ్డా సూచనతో పవన్‌ ఏపీ బీజేపీ ఇంచార్జ్‌లు మురళీధరన్‌, సునీల్‌ దేవధర్‌లతో చర్చలు జరిపారు. ఈ భేటీలో పొత్తుపై బీజేపీ నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. పొత్తులపైన ఆలోచిస్తామనే ధోరణిలోనే బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, గత ఎన్నికల్లో పాచిపోయిన లడ్డులు ఇచ్చారంటూ బీజేపీపై పవన్‌ తీవ్రంగా దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు బాటలో నడిచిన పవన్‌ బీజేపీపై విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. అయితే ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్దమయ్యారు. మరోవైపు బీజేపీని ఏదో చేస్తానని బీరాలు పలికిన చంద్రబాబు కూడా టీడీపీ ఘోర ఓటమితో యూటర్న్‌ తీసుకుని సైలెంట్‌ అయ్యాడు.

మరిన్ని వార్తలు