దాడులేనా మీ రాజకీయం?

30 Sep, 2018 04:34 IST|Sakshi

     దెబ్బకు దెబ్బతీస్తాం.. టీడీపీ నేతలకు పవన్‌ హెచ్చరిక

     హింసాత్మక రాజకీయాలను ఊరుకోం 

     జనసేన కార్యాలయంపై డ్రోన్‌లతో నిఘా

     బాబు వచ్చాక లోకేశ్‌కే జాబొచ్చింది 

చింతలపూడి (పశ్చిమగోదావరి): జనసేన కార్యకర్తలు జెండాలు కడుతుంటే టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. ఇలాంటి చర్యలను తక్షణం మానుకోకపోతే సత్తా చూపిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని, దెబ్బకు దెబ్బతీస్తామని చెప్పారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జనసేన పోరాట యాత్ర బహిరంగ సభలో పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. పిడికిలికి ఉన్న బలం రెండువేళ్లకు ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలియజేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనకు గతంలో ఇచ్చిన గన్‌మన్‌లలో ఒకరు రోజూ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌కి తన సమాచారం పంపుతూ వచ్చారని, అంతేగాక హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంపై డ్రోన్‌లతో నిరంతరం నిఘా పెట్టారన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో తాను విడిది చేసిన చోట రాత్రి సమయంలో 30 మంది దాడికి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆ సమయంలో ఒక్క పోలీసు కూడా లేరని తెలిపారు. పోలీసులను పంపించివేసి  దాడులకు ఉసిగొల్పడమేనా మీ రాజకీయం? అంటూ ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, జాబు వచ్చింది ముఖ్యమంత్రిగారి అబ్బాయికేనని విమర్శించారు. కిలో రూపాయి బియ్యం కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికాకు తరలించి..  ఆ సొమ్ముతో కాలిఫోర్నియాలో ద్రాక్ష తోటలు కొంటున్నారని, మన గ్యాస్‌ నిక్షేపాలు గుజరాత్‌కు తరలించుకుని పోతున్నారని, మన వాటా మనం తీసుకునే వరకు పోరాడదామని చెప్పారు. 

జనసేన జెండా కడితే నేరమా..
తనపై దాడి విషయంలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే దానిని స్వీకరించలేదని పవన్‌ చెప్పారు. శాంతి భద్రతల విషయంలో ఇలానే వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. అందరినీ గుర్తుపెట్టుకుంటామని, టెక్కలి నుంచి రాయలసీమ వరకు జనసేన కార్యకర్తలను, యువతను బెదిరిస్తున్నారని, జెండా కట్టినా, జనసేన పచ్చబొట్టు వేసుకున్నా బూట్లతో తొక్కి బెల్టులతో కొట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి  హింసాయుత రాజకీయాలు కావాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఇసుక, మట్టి దోచేస్తున్నారని ఆరోపించారు. మంత్రి లోకేశ్‌ 14 వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని చెబుతున్నారని, చింతలపూడిలోని రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలని అన్నారు. జిల్లాలో మహిళా ఎమ్మెల్యే సుజాతను ఒక రౌడీ ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడని, పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేకు ఇక్కడేమి పని అని ప్రశ్నించారు. ఇక్కడకు వచ్చి రౌడీయిజం చేస్తే కాళ్ళు విరగ్గొట్టి కింద కూర్చోబెడతామని చింతమనేనిని ఉద్దేశించి హెచ్చరించారు. రౌడీ ఎమ్మెల్యే ఓ మహిళా ఎమ్మెల్యేను బెదిరిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు