కుట్ర జరుగుతోందంటూ పవన్ ఆందోళన

26 Apr, 2018 18:53 IST|Sakshi
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

గుంటూరు, చిత్తూరు జిల్లాల పర్యటన వాయిదా

సాక్షి, హైదరాబాద్: తనపై, తన పార్టీపై కుట్ర జరుగుతోందంటూ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడల్లా కుట్ర జరుగుతోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిఘా వర్గా హెచ్చరికతో పవన్ కల్యాణ్ ఆగిపోయారని, అందుకే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పవన్ పర్యటనను వాయిదా వేసుకున్నారని జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి వెల్లడించారు. తునిలో జరిగిన రైలు విధ్వంసం వంటి చర్యలకు పాల్పడి జనసేన పార్టీకి చెడ్డపేరు వచ్చేలా కుట్ర జరుగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించి సమాచారం అందించాయి. పక్క రాష్ట్రాల నుంచి కిరాయి మూకలు తెచ్చి అల్లర్లు జరిగాయని, కొన్ని స్వార్థపర శక్తులు ప్రస్తుతం జనసేనను దెబ్బతీసే ప్రయత్నం చేశాయని ప్రకటనలో పేర్కొన్నారు. 

తొలుత ఈ నెల 21, 22, 23 తేదీల్లో శెట్టిపల్లిలో భూసేకరణ సమస్య, చిత్తూరు పట్టణంలో హైవే రోడ్డు నిర్మాణంలో బాధితులకు జరుగుతున్న అన్యాయం తెలుసుకునేందుకు పర్యటన ఖరారు చేశారు. ఈ నెల 30న కామన్వెల్త్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన తెలుగు తేజం, గుంటూరు జిల్లావాసి వెంకట రాహుల్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించాలని జనసేన అధినేత పవన్ భావించారు. కానీ నిఘా వర్గాల హెచ్చరికతో ప్రజలు, ప్రజా ఆస్తులకు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో కార్యక్రమాలను పార్టీ వాయిదా వేసినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు.

 

మరిన్ని వార్తలు