డీఎంకేకు కరుప్పయ్య బై బై

13 Dec, 2019 11:48 IST|Sakshi

పార్టీ కార్పొరేట్‌ ఏజెన్సీగా మారిందని ఆవేదన  

సాక్షి, చెన్నై: డీఎంకేకు పల కరుప్పయ్య రాజీనామా చేశారు. తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు లేఖ రాశారు. కార్పొరేట్‌ ఏజెన్సీ, సంస్థల చేతికి పార్టీ చేరినట్టుగా కరుప్పయ్య ఆవేదన వ్యక్తం చేశారు.  అన్నాడీఎంకేలో ఏళ్ల తరబడి కొనసాగి 2016లో అమ్మ జయలలితను ఢీకొట్టి పార్టీ నుంచి పల కరుప్పయ్య బయటకు వచ్చారు. అన్నాడీఎంకే నుంచి బయటకు రావడమే కాదు, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హార్బర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.

ఆ తదుపరి పరిణామాలో డీఎంకేలో చేరారు. అధికార ప్రతినిధి హోదాతో ముందుకు సాగుతూ వచ్చిన ఆయన.. కొన్ని చిత్రాల్లోనూ నటనపై దృష్టి పెట్టారు. విజయ్‌ నటించిన సర్కార్‌ చిత్రంలో సీనియర్‌ నేతగా, సీఎం పాత్రలో పరోక్షంగా దివంగత డీఎంకే నేత కరుణానిధిని తలపించే దిశగా అందర్నీ మెప్పించారు. సినిమాలు, రాజకీయపయనం అంటూ సాగుతూ వచ్చిన కరుప్పయ్య గురువారం ఓ ప్రకటన చేశారు. తాను డీఎంకే నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తూ లేఖను స్టాలిన్‌కు పంపించారు.  

బై..బై.. 
మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాలు, పార్టీలపై విమర్శలు గుప్పించే రీతిలో కరుప్పయ్య స్పందించారు. పరోక్షంగా డీఎంకేను ఉద్దేశించి ఆయన మాటల తూటాల్ని పేల్చారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన తనను ఓ వివాహ వేదికపై.. కరుణానిధి తనను చూశారని గుర్తు చేశారు. ఆయన పిలుపుమేరకు తాను బలవంతంగానే డీఎంకేలోకి వచ్చానని పేర్కొన్నారు. ఆయన మరణం తదుపరి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నా, పరిస్థితులు అనుకూలించలేదన్నారు. అయితే, ప్రస్తుతం కార్పొరేట్‌ సంస్థ అన్నట్టుగా పరిస్థితులు మారి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దివంగత ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి అనుసరించిన రాజకీయవ్యూహాలు, సిద్ధాంతాలను గుర్తు చేస్తూ, ఇప్పుడు అవన్నీ ప్రకటనల ఏజెన్సీల సంస్థల గుప్పెట్లోకి చేరి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలు ఇచ్చే సలహాలు సూచనల్ని పాటించే స్థాయికి దిగజారే పరిస్థితి ఒక గొప్ప పార్టీకి రావడం ఆవేదన కల్గిస్తున్నదని, అందుకే బయటకు రావడం మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. తల పండిన నేతలు, సీనియర్లతో చర్చించి వ్యూహాల్ని రచించే కాలం పోయి, ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థల వలే ఏజెన్సీలకు అప్పగించడం ఆయా పార్టీల నేతల చేతగానితనానికి నిదర్శనం అన్నట్టుగా పరిస్థితులు మారుతాయని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు