ఉగ్రవాదులు కాదు.. వాళ్లూ అమర వీరులే!

11 Jan, 2018 14:35 IST|Sakshi

శ్రీనగర్‌ : కశ్మీర్‌ అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ చిచ్చును రాజేస్తున్నాయి. పీపుల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఎమ్మెల్యే ఐజాజ్‌ అహ్మద్‌ మీర్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోతున్న టెర్రరిస్టులను అమర వీరులుగా పేర్కొన్నారు. దీంతో మిత్రపక్షం బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 

‘‘ఉగ్రవాదులను చనిపోతుంటే మేం వేడుకలు చేసుకోలేం. ఎందుకంటే వారు మాకు సోదరులే. ఇకపై జవాన్ల కుటుంబాలతోపాటు మిలిటెంట్ల కుటుంబాలకు కూడా మా సంఘీభావం తెలుపుతాం’’ అని గురువారం అసెంబ్లీ బయట ఓ జాతీయ మీడియాతో మీర్‌ వ్యాఖ్యానించారు. చనిపోయిన వారు ఉగ్రవాదులా? పోలీసులా? అని తమకు సంబంధం లేదని.. కశ్మీర్‌ గడ్డపై పుట్టిన వారందరినీ తాము అమరులుగానే భావిస్తామని ఆయన చెప్పారు. కశ్మీర్‌ విషయంలో వేర్పాటువాదులతో, ఉగ్రవాదులతో ప్రభుత్వం చర్చలు జరపాలంటూ మీర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. 

కాగా, మీర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న వాచి అసెంబ్లీ నియోజక వర్గం(సోఫిన్‌ జిల్లా)లో ఉగ్రవాదుల దాడులు తరచూ జరుగుతుంటాయి. గత అక్టోబర్‌లో మీర్‌ ఇంటిపైనే గ్రెనేడ్‌ దాడి జరగగా.. స్వల్ఫ గాయాలతో ఆయన బయటపడ్డాడు. అయినా సరే ఉగ్రవాదులకు మద్దతుగా ఆయన అసెంబ్లీలో గళం వినిపిస్తున్నారు. వారు చనిపోయినప్పుడు వేడుకలు చేసుకోవద్దంటూ బుధవారం ఎమ్మెల్యేలకు ఆయన పిలుపు కూడా ఇచ్చారు. 

ఇక మీర్‌ వ్యాఖ్యలను మిత్రపక్షం బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. నరరూప రాక్షసులను అమరులుగా అభివర్ణించటాన్ని కశ్మీర్‌ రవాణా శాఖా మంత్రి సునీల్‌ శర్మ తప్పుబట్టారు. ఇక ఈ వ్యాఖ్యలు పీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శమని ప్రతిపక్ష పార్టీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ విమర్శిస్తోంది. 

మరిన్ని వార్తలు