పీడీపీ ఎంపీలను సభ నుంచి ఈడ్చేసిన మార్షల్స్‌

5 Aug, 2019 13:07 IST|Sakshi

సభలో తీవ్ర ఆందోళన చేసిన పీడీపీ సభ్యులు

సభా చైర్మన్‌ తీవ్ర ఆగ్రహం

సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా ప్రకటించడంతో సభలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. విపక్ష సభ్యుల ఆందోళనతో పెద్దల సభ గందరగోళంగా మారింది. అమిత్‌ షా ప్రసంగిస్తున్న సమయంలో జమ్మూకశ్మీర్‌కు చెందిన పీడీపీ సభ్యులు నజీర్‌ అహ్మాద్‌, ఎంఎం ఫయాజ్‌  పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆయన ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. సభలో పెద్ద ఎత్తున అరుస్తూ.. వీరంగ సృష్టించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు వారిని సభ నుంచి బయటకు పంపించాల్సిందిగా మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో వారిద్దరిని ఈడ్చూకుంటూ సిబ్బంది సభ నుంచి బయటకు పంపించారు. ఈ ఘటనలో ఎంపీ నజీర్‌ చొక్కా పూర్తిగా చినిగిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. ఆయన సభ నుంచి బయటకు వచ్చారు.

కాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్‌తో విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడుతోన్న విషయం తెలిసిందే. ​జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యంలో నేడు ఒక దుర్దినం అని.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని విమర్శించారు

మరిన్ని వార్తలు