వివేక్‌కు షాక్ ఇచ‍్చిన కేసీఆర్‌

22 Mar, 2019 08:33 IST|Sakshi

పెద్దపల్లిలో వెంకటేశ్‌కు చాన్స్‌

ఆదిలాబాద్‌ సీటు సిట్టింగ్‌కే

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వెల్లడి

సాక్షి, మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి.వివేక్‌కు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గట్టి షాక్‌నిచ్చారు. పెద్దపల్లి లోకసభ స్థానం(ఎస్సీ) నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసేందుకు వివేక్‌ సన్నద్ధమవగా, ఆయనను కాదని చివరి నిమిషంలో పార్టీలో చేర్చుకొని మరీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకానికి చాన్స్‌ ఇచ్చారు. ఇక ఆదిలాబాద్‌ స్థానం(ఎస్టీ) మాత్రం సిట్టింగ్‌ ఎంపీ గోడం నగేష్‌నే వరించింది. సుధీర్ఘ కసరత్తు అనంతరం గురువారం రాత్రి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మొత్తం 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

సిట్టింగ్‌కే ఆదిలాబాద్‌ 
ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌కే మరోసారి టీఆర్‌ఎస్‌ అవకాశం కల్పించింది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన గోడం నగేష్‌కే ఈసారి కూడా టికెట్‌ వస్తుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే నగేష్‌కు పార్టీ టికెట్టు ప్రకటించారు. లోకసభ నియోజకవర్గ పరిధిలోని ఒకరిద్దరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలు విముఖత వ్యక్తం చేసినా, అధిష్టానం మాత్రం నగేష్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని బజార్‌హత్నూర్‌ మండలం జాతర్ల గ్రామానికి చెందిన నగేష్, 1994 నుంచి టీడీపీలో కొనసాగారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరి టికెట్టు తెచ్చుకొన్నారు. ఈ ఎన్నికల్లో రెండోసారి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

జంప్‌ ఫలితం 
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బోర్లకుంట వెంకటేశ్‌కు టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిత్వం దక్కడం చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమక్షంలో వెంకటేశ్‌ గులాబీ గూటికి చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరిన కొన్ని గంటల్లోనే ఆయన టీఆర్‌ఎస్‌ బీ–ఫారం అందుకున్నారు. కాగా టికెట్‌ ఇస్తామనే గ్యారంటీతోనే ఆయన హడావుడిగా టీఆర్‌ఎస్‌లో చేరినట్లు సమాచారం. మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన బోర్లకుంట వెంకటేశ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్‌ చేతిలో ఓటమి చెందారు. ప్రస్తుతం చివరి నిమిషంలో పార్టీ మారి టీఆర్‌ఎస్‌ ఎంపీ టికెట్టు అందుకున్నారు.
 
చక్రం తిప్పిన బాల్క సుమన్‌ 
పెద్దపల్లి ఎంపీ టికెట్‌ వెంకటేశ్‌కు రావడంలో చెన్నూరు ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్‌ ప్రధానంగా చక్రం తిప్పినట్లు సమాచారం. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేక్‌ టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో అనూహ్యంగా బాల్క సుమన్‌కు పెద్దపల్లి ఎంపీ టికెట్టు దక్కింది. వివేక్‌పై సుమన్‌ గెలిచిన తరువాత, వివేక్‌ తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ ఇరువురి నడుమ విభేదాలు మాత్రం కొనసాగాయి. నియోజకవర్గంలో ఆధిపత్య పోరు పలుమార్లు బయటపడింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సుమన్‌ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి, చెన్నూరు అసెంబ్లీ బరిలో దిగారు. దీంతో వివేక్‌కు ఎంపీ టికెట్‌ ఖాయమని అంతా భావించారు. కాని అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశారంటూ కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు ఇతర ఎమ్మెల్యేలను కూడగట్టడంలో సుమన్‌ కీలకంగా వ్యవహరించారు.

అంతేకాకుండా వివేక్‌కు ప్రత్యామ్నయంగా తన చేతిలో ఓడిపోయిన వెంకటేశ్‌ను కూడా సిద్ధం చేసి ఉంచారు. అయినప్పటికీ వివేక్‌ వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందని పార్టీ వర్గాలు భావించాయి. కాని బుధ, గురువారాల్లో మారిన నాటకీయ పరిణామాలతో వివేక్‌కు బదులు వెంకటేశ్‌ అకస్మాత్తుగా తెరపైకి వచ్చారు. మొత్తానికి తన ఆధిపత్యానికి అడ్డుగా మారనున్న వివేక్‌ను అడ్డుకోవడంలో సుమన్‌ సఫలం చెందినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే టికెట్టు దక్కని వివేక్‌ భవిష్యత్‌ నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

వివేక్‌ భవితవ్యం ఎటు?
పెద్దపల్లి సీటు చేజారిన మాజీ ఎంపీ వివేకానంద రాజకీయ భవిష్యత్తు చిక్కుల్లో పడింది. 2013లో తెలంగాణ ఉద్యమం చివరి దశలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఎంపీగా ఉంటూనే తన సోదరుడు వినోద్‌తో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో వివేక్‌కు ఎంపీ సీటు ఖరారైనప్పటికీ, తన సోదరుడు వినోద్‌కు చెన్నూరు టికెట్టు ఇవ్వని కారణంగా పార్టీని వీడారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో పెద్దపల్లి టికెట్టు హామీతో మరోసారి టీఆర్‌ఎస్‌లో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తన సోదరుడికి టికెట్టు విషయంలో కేసీఆర్‌ ఆగ్రహానికి గురయ్యారు.

వినోద్‌ బీఎస్‌పీ నుంచి పోటీ చేయగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిన్నయ్యకు వ్యతిరేకంగా తన సోదరుడిని గెలిపించేందుకు కృషి చేశారని ప్రభుత్వ నిఘా వర్గాలు కేసీఆర్‌కు సమాచారం ఇచ్చాయి. అదే సమయంలో మిగతా ఎమ్మెల్యేలు కూడా తమను ఓడించేందుకు వివేక్‌ ప్రయత్నించారని చేసిన ఫిర్యాదులతో ఆయన సీటుపై వేటు పరిపూర్ణమైంది. కాగా ఇప్పుడు మరో పార్టీలోకి వెళ్లే సాహసం చేస్తారా లేదా అనేది అర్థం కావడం లేదు. బీజేపీ నేతలు ఇప్పటికే వివేక్‌తో టచ్‌లో ఉండి, పెద్దపల్లి సీటుకు అభ్యర్థిని ప్రకటించలేదు. వివేక్‌ బీజేపీలో చేరితే టికెట్టు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉంది. అయితే గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో మరోసారి సాహసం చేస్తారా లేదా అనేది చూడాల్సిందే.

మరిన్ని వార్తలు