ప్రభుత్వంపై బురద చల్లడమే చంద్రబాబు పని

11 Jun, 2020 04:14 IST|Sakshi

కేంద్ర నిబంధనల ప్రకారమే ‘సరస్వతి’ లీజు గడువు పెంపు

చంద్రబాబు ఇలా 30 సంస్థలకు పొడిగించలేదా?: మంత్రి పెద్దిరెడ్డి 

సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకుని చంద్రబాబు నిత్యం అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర గనులు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న చందంగా ప్రభుత్వం ఏం చేసినా చంద్రబాబుకు తప్పుగానే కనిపిస్తోందని ఎండగట్టారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంచాలకులు వెంకటరెడ్డితో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి ఏమన్నారంటే..

కేంద్ర నిబంధనల ప్రకారమే లీజు పొడిగింపు
► కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ (ఎంఎండీఆర్‌ ) చట్టం–2015లోని సెక్షన్‌ 8ఏ (3) ప్రకారం అప్పటికే లీజులున్న వారు దరఖాస్తు చేసుకుంటే 50 ఏళ్లకు లీజు గడువు కచ్చితంగా పొడిగించాలి. 
► దీని ప్రకారమే సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీ దరఖాస్తు చేసుకుంది. నిబంధనల ప్రకారమే ప్రభుత్వం ఈ సంస్థకు మైనింగ్‌ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ ఈనెల 8న జీవో జారీ చేసింది. దీనిని చంద్రబాబు భూతద్దంలో చూపుతూ సీఎం సొంత సంస్థకు అక్రమంగా లీజును పొడిగించుకున్నారంటూ తప్పుడు విమర్శలు చేయడం శోచనీయం.
► సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌కు 2009 మే 18న ప్రభుత్వం 613 హెక్టార్ల సున్నపురాయి మైనింగ్‌ లీజు మంజూరు చేసింది. 
► రాజకీయ కారణాలతో టీడీపీ ప్రభుత్వం 2014లో ఆ లీజును రద్దు చేయగా.. సరస్వతి పవర్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.
► విచారణ జరిపిన హైకోర్టు సదరు లీజును పునరుద్ధరించాలని  ఆదేశించటంతో గనుల శాఖ అధికారులు లీజు పునరుద్ధరణ ఉత్తర్వులిచ్చారు.
► ఆ తరువాత సదరు సంస్థ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ అధికారులు జీవో ఇచ్చారు. 

మీరు చేస్తే పవిత్రం.. ఈ ప్రభుత్వం చేస్తే అపవిత్రమా!
► చంద్రబాబు హయాంలో 30 సంస్థల మైనింగ్‌ లీజులను 50 ఏళ్లకు పెంచుతూ జీవోలి చ్చారు. అప్పట్లో వారు చేసింది పవిత్రం.. ఈ ప్రభుత్వం చేస్తే అపవిత్రమైపోతుందా.
► అప్పట్లో చంద్రబాబు గనుల లీజుల పెంపుదల నిర్ణయాలన్నీ  ఆశ్రిత పక్షపాతంతో కూడినవేనని చంద్రబాబు ఒప్పుకోవాలి. లేదంటే క్షమాపణ చెప్పాలి. 
► లేటరైట్‌ గనులను కబ్జా చేస్తున్నట్లు చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క లేటరైట్‌ మైనింగ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు. వాస్తవాలను పక్కనపెట్టి ఎల్లో మీడియాలో చంద్రబాబు తప్పుడు రాతలు రాయిస్తున్నారు. 

మరిన్ని వార్తలు