పగలు మోసాలు.. రాత్రిళ్లు మంతనాలు

25 May, 2018 04:53 IST|Sakshi

సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ధ్వజం

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడింది చంద్రబాబే

ఎన్టీఆర్‌ ఆశయాలకు బాబు తూట్లు

మైలవరం: సీఎం చంద్రబాబు రాత్రిళ్లు కాంగ్రెస్, బీజేపీలతో మంతనాలు చేస్తూ, పగలు మాత్రం రాష్ట్ర విభజనలో అన్యాయం జరిగిందంటూ దీక్షలు, సభలతో ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నీచ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చంద్రబాబు మారారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం మైలవరం రెడ్‌ గ్రౌండ్‌లో గురువారం జరిగింది.

మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితుడైన వసంత కృష్ణప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కై పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు పెట్టించారన్నారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడిన వ్యక్తి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్‌టీఆర్‌ టీడీపీని ఏర్పాటు చేస్తే మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అదే కాంగ్రెస్‌కు దాసోహమయ్యి ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు.

కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టించి టీడీపీ నేతలు వేధిస్తున్నా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆత్మస్థైర్యంతో వైఎస్‌ జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని అభినందించారు. మైలవరం మండల పార్టీ అధ్యక్షుడు పామర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నేతలు సామినేని ఉదయభాను, జోగి రమేష్, ఎమ్మెల్యే రక్షణనిధి, మొండితోక జగన్మోహనరావు, అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, అప్పిడి సత్యనారాయణరెడ్డి, కాజా రాజకుమార్,  వేములకొండ రాంబాబు, వేములకొండ తిరుపతిరావు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు