అంపశయ్యపై ఉన్నా ఆరాటమేనా?

19 Mar, 2020 04:32 IST|Sakshi

చంద్రబాబు, ఎల్లో మీడియాపై మంత్రి పెద్దిరెడ్డి ధ్వజం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఈనాడు అధిపతి రామోజీరావు అంపశయ్యపై ఉన్నా చంద్రబాబు కోసం ఆరాటపడుతున్నారని, తప్పుడు వార్తలు, దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సాకుతో చంద్రబాబు ఉనికికోసం ఎల్లో మీడియా కుట్రలు పన్నుతోందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..

ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికోసం స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేశారు. బాబు, రమేష్‌ ఇద్దరూ ఎస్వీయూ విద్యార్థులే, వారి మధ్య మంచి సంబంధాలున్నాయి. 
‘ఇలాగైనా గెలవచ్చు’ ‘ప్రజాస్వామ్యానికి పునాది’ అంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. నేను పుంగనూరు నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న తర్వాత టీడీపీ అక్కడ ఏనాడైనా గెలిచిందా?  
పుంగనూరు 2వ వార్డుకు విజయమ్మ అనే టీడీపీ అభ్యర్థిని నామినేషన్‌ దాఖలు చేయకుండా వైఎస్సార్‌సీపీ అడ్డుకోవడంతో ఆత్మహత్యాయత్నం చేసిందంటూ ‘ఈనాడు’ నిస్సిగ్గుగా రాసింది. విజయమ్మ భర్త రామయ్య ఆమె పక్కనే నవ్వుతూ ఫొటోలో ఉన్నారు. ఆమె చుట్టూ ఉన్నవారంతా టీడీపీ వర్గీయులే. 
సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థికి మద్దతుగా నామినేషన్‌కు హాజరైన ఎస్‌ సద్దాం అనే వ్యక్తి ఘర్షణకు దిగి రాయి విసురుతుంటే ప్రజాస్వామ్యానికి పునాది రాయి, వైఎస్సార్‌సీపీ దౌర్జన్యానికి నిదర్శనమంటూ ఈనాడు తప్పుడు కథనాలు రాసింది. వీటినే ఎన్నికల అధికారులు సుమోటోగా స్వీకరించారు. 
ప్రభుత్వ సంక్షేమ పాలన చూసి ప్రజలు వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పడుతుంటే టీడీపీకి దిక్కు తోచట్లేదు. ఆ పార్టీ క్యాడర్‌ పోటీ చేసేందుకు ఆసక్తి చూపట్లేదు. ఎన్నికలు ఏకగ్రీవమైతే ప్రభుత్వ నజరానాతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన  ప్రజల్లో ఉంది. ఏకగ్రీవాలైతే మీకు కడుపు మంట ఎందుకు?
చిత్తూరు జిల్లాలో బాబు, రమేష్‌కుమార్‌ పోటీచేసి గెలిస్తే నేను రాజీనామా చేస్తా.
ముఖ్యమంత్రి జగన్‌ సంక్షేమ పథకాలు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను మోసం చేసిన చంద్రబాబు మళ్లీ ఆయన ఫొటోతో ఎన్నికలకు వెళ్తున్నారు. అలాంటి వ్యక్తి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించడం దుర్మార్గం. 

మరిన్ని వార్తలు