చంద్రబాబు హోదా ద్రోహి : పెద్దిరెడ్డి

13 Apr, 2018 19:54 IST|Sakshi

సాక్ష, విజయవాడ : ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వజమెత్తారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హోదాకోసం పోరాడాల్సింది పోయి, బందులతో ఏం సాధిస్తామని వ్యాఖ్యానించడం శోచనీమని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు పలుసార్లు మాటలు మార్చారంటూ మండిపడ్డారు. హోదా సాధన కోసం ఉద్యమించిన వాళ్లపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రత్యక హోదా పేరు ఎత్తితే అరెస్టు చేయాలన్న చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా ఏముఖం పెట్టుకొని అడుగుతున్నారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

చంద్రబాబు కారణంగా చాలా మంది విద్యార్థులు నేటికి కేసుల విచారణకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని రామచంద్రారెడ్డి తెలియచేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోసం చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదా ద్రోహి అని, రాజకీయ లబ్ధికోసమే తమ ఎంపీలతో పార్లమెంట్‌లో డ్రామాలాడించారంటూ విమర్శించారు. హోదా సాధనపై తెలుగుదేశం ఎంపీలు, ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వైఎస్సార్‌ సీపీ ఎంపీల మాదిరి రాజీనామాలు చేసి పోరాటం చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని విపక్షాలు ప్రజా సంఘౠలు ఏకమై ప్రజలును మమేకం చేసి ప్రత్యేక హోదా సాధనకు పోరాడుతుంటే, చంద్రబాబు వారి పోరాటాన్ని నీరుగార్చే విధంగా మాట్లాడుతున్నారంటూ పెద్దిరెడ్డి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు